ఆంధ్ర ప్రదేశ్‌లో రాష్ట్రపతి ప్రారంభించిన ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రసారాలు మరో రాజకీయ వివాదంగా మారుతున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్ష వైసీపీ నేత స్వయంగా కేబుల్ అధినేత అయిన అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం ఒకటైతే ఆసలు ఆపరేటర్ల నుంచి కూడా అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు బాగా విస్తరించి వున్న కేబుల్ వ్యవస్థను విచ్చిన్నం చేయడంలో టిడిపి రాజకీయ ప్రయోజనాలున్నాయనేది వైసీపీ ఆరోపణ. అంతేగాక టూవే ఆప్టిక్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు వీక్షకులతో ముఖాముఖి మాట్లాడే వీలు కలుగుతుందని ఇంత ఖర్చు భరించడం అందుకోసమేనని వారు అంటున్నారు.కోటి ఇళ్లకు కనెక్షన్స్ ఇచ్చేబాధ్యత ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ స్తంభాలపై లెసెన్సుడు ఆపరేటర్లు తీగలు వేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలున్నా అడ్డుపడి ఇప్పుడు తమ ఫైబర్ కార్పొరేషన్‌కు మాత్రమే ప్రత్యేక హక్కులు కట్టబెడుతున్నారని అంబటి ఆగ్రహిస్తున్నారు.ఈ క్రమంలో నచ్చిన వారినే ఆపరేటర్లుగా అవకాశం ఇచ్చేందుకు నచ్చిన ఛానల్స్‌నే ప్రసారం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని వైసీపీ ఆరోపణగా వుంది. ఇక ఆపరేటర్ల విషయానికి వస్తే ఇంటర్నెట్ 149కే ఇస్తామని ప్రచారం చేస్తున్నప్పటికీ 245 వసూలు చేయవలసిందిగా తమకు చెబుతున్నట్లు వారు అంటున్నారు.ఇదే గాక కనెక్షన్ ఏర్పాటుకు 1500 నుంచి 5000 వరకూ వసూలు చేయవలసి వుంటుందని చెబుతున్నారు. పైకి ఒక ప్రచారం చేసి వాస్తవంగా తాము అధిక వసూళ్లకు వెళితే ప్రజలు తిరస్కరిస్తారని అపార్థం చేసుకుంటారని వాపోతున్నారు. గతంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే వెంటపడిమరీ సెటప్బాక్సులు పెట్టిస్తే ఇప్పుడు అవన్నీ నిరర్థకంగా మారుతున్నాయనేది మరో సమస్య.వీటన్నిటికి ఎలాటి సమాధానాలు పరిష్కారాలు వస్తాయో చూడాల్సిందే. ఇక మొదటిరోజున రాష్ట్రపతితో మాట్లాడేందుకు నిరీక్షించిన అంగన్ వాడీలకు కనెక్షన్ రాకపోవడం మరోకొసమెరుపు. ఈ విమర్శలను ప్రారంభ కష్టాలను అదిగమించేందుకు ఏం చేస్తారో మరి.. విమర్శలు ఎలా వున్నా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం మంచిదేనని మాత్రం అందరూ ఒప్పుకుంటున్నారు.