గడచిన వారంలో వరుసగా భాజపా, కాంగ్రెస్ పార్టీలపై తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శల తీవ్రతను దశలవారీగా పెంచుతున్న తీరు చూస్తున్నాం. ఏదో ఒక దీర్ఘకాలిక ప్రణాళిక లేకుండా ఆయన ఇలా అసందర్భంగా విమర్శలు చెయ్యరు కదా! అయితే, ఆ ప్లాన్ ఏంటనే కేసీఆర్ బయటపెట్టేశారు. పరిస్థితులు డిమాండ్ చేస్తే కొత్త నాయకుడు పుడతాడన్నారు. అందుకు ఉదాహరణగా తెలుగుదేశం ఆవిర్భావాన్ని ఊటంకిస్తూ… పార్టీ పెట్టిన 8 నెలల్లోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. తెరాస కూడా అంతేననీ, పార్టీ ఏర్పాటు చేసిన వెంటనే క్షేత్రస్థాయిలో సత్తా చాటుకుందనీ, ఆ తరువాత తన లక్ష్యాన్ని ముద్దాడిందన్నారు.
దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పులు రావాల్సిన తరుణమిదేనని కేసీఆర్ అన్నారు. గడచిన 70 ఏళ్లుగా కాంగ్రెస్, లేదా భాజపాలే ఎక్కువ కాలం దేశాన్ని పాలించాయన్నారు. ఈ దొందూ దొందేననీ పథకాలకు పేర్లు మార్చడం తప్ప, వీరు కొత్తగా చేసిందేమీ ఉండటం లేదని ఎద్దేవా చేశారు. ఈ దశలో దేశానికి ప్రత్యామ్నాయ అవసరం కనిపిస్తోందన్నారు. దాన్ని థర్డ్ ఫ్రెంట్ అంటారో మరేదైనా పేరు పెడతారో అనేది తరువాతి చర్చ అన్నారు. అలాంటి ప్రత్యామ్నాయ కూటమి కోసం తాను పనిచేస్తున్నాను అని కేసీఆర్ ప్రకటించడం విశేషం. దాని కోసం అవసరమైన వారితో మాట్లాడుతున్నాననీ, దేశానికి తన సేవలు అవసరం ఉందంటే కచ్చితంగా సిద్ధంగా ఉన్నానని తన మనసులో మాట బయటపెట్టేశారు కేసీఆర్. మార్పునకు నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాననీ, కొత్తగా రాబోయేది మూడో కూటమి కాదనీ.. అదే ప్రథమ ప్రత్యామ్నాయం అన్నారు.
జాతీయ రాజకీయాలపై కేసీఆర్ లో ఆశ పెరుగుతున్నట్టుంది కదా. మంచిదే, ఎవరు కాదంటారు! కాకపోతే, మూడో ప్రత్యామ్నాయానికి నాయకత్వం వహించేస్తానని స్వీయ ప్రకటన చేసుకోవడమే కాస్త అత్యాశ అనిపిస్తోంది. నేరుగా చెప్పకపోయినా ప్రధాని కావాలనే ఆశని కేసీఆర్ బయటపెట్టుకున్నట్టయింది కదా! అయితే, ‘నాయకత్వం’ అనే మాట లేకుండా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిస్తే బాగుండేది. కాంగ్రెస్, భాజపాలకు ప్రాంతీయ పార్టీల కూటమి ప్రత్యామ్నాయం కాబోతోందని చెబుతూ, దీనికోసం తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి ఉంటే మరింత హుందాగా వినిపించేది. అంతేగానీ, ‘కొత్త నాయకుడిని నేనే’ అని ప్రకటించుకోవడమే కాస్త అతి అనిపిస్తోంది. ఎందుకంటే, ఇతర రాష్ట్రాల్లో కూడా బలమైన ప్రాంతీయ పార్టీలున్నాయి, కేసీఆర్ కంటే ముందే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన పాంత్రీయ పార్టీల అధినేతలూ అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. వారందరితోపాటూ తాను కలిసి నడుస్తాననే సంకేతాలు కేసీఆర్ ఇస్తే బాగుంటుంది. అంతేగానీ, తానే నాయకుడిని అవుతానని ప్రకటించుకోవడంలో అత్యాశే ఎక్కువగా బయటపడుతోంది…!