గులాబీదళంలో నుంచి పెద్దలసభకు వెళ్లే ముగ్గురు నేతలెవరు? ఈ ప్రశ్న ఇప్పుడు టీఆర్ఎస్లో చక్కర్లు కొడుతోంది.
తెలంగాణలో మార్చి చివరినాటికి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎంపీలు సీఎం రమేష్, రాపోలు ఆనంద్ భాస్కర్ పదవీ విరమణ చేస్తుంటే…పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మృతితో మరో స్థానం ఖాళీయైంది. ఈ మూడు స్థానాల భర్తీ కోసం మార్చి 5న నోటిఫికేషన్ రాబోతుంది. నామినేషన్ల స్వీకరణకు మార్చి 12 చివరితేదీ. మార్చి 23న ఎన్నికలు జరుగుతాయి. టీఆర్ఎస్కు దక్కే ఈ మూడు స్థానాల్లో ఎవరెవరికి చాన్స్ దక్కుతుందనే దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. కేసీఆర్ మదిలో ఏముందో తెలియక గులాబీ నేతలు ప్రగతిభవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రాజ్యసభ లిస్ట్‌లో వినిపించే తొలిపేరు సంతోష్ కుమార్. కేసీఆర్‌కు అంతరంగికుడు. దగ్గరి బంధువు. టీన్యూస్ ఎండీ. ఈయన ఈ సారి పెద్దలసభలో అడుగుపెట్టడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో సామాజిక సమీరణ లెక్కలు వేస్తున్న కొందరు నేతలు ఈయన్ని రాజ్యసభకు పంపాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ సీటుకు ఎసరు రావొద్దంటే సంతోష్‌ను సైడ్‌లైన్ చేయాలని వారు ప్లాన్లు వేస్తున్నారు. ఇందులో భాగంగా రేసులో తొలిపేరులో పెట్టారనే ప్రచారం నడుస్తోంది. ఇక రెండో సీటు బీసీలకు ఇస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా యాదవులకు ఈ సీటు దక్కబోతుంది. కరీంనగర్ జడ్పీ ఛైర్మన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య, రాజయ్య యాదవ్, టీఎన్జీవో నేత ఎంబి కృష్ణయాదవ్ ప్రధానంగా రేసులో ఉన్నారు. మూడో సీటు ముస్లిలంకు లేకపోతే రెడ్డి వర్గానికి కేటాయిస్తారని సమాచారం. అయితే లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ పెట్టడంలో కేసీఆర్ దిట్ట. ఆయన మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఆయన లెక్కలు వేరుగా ఉంటాయి. చివరి నిమిషంలో కూడా కొత్త పేర్లు తెరపైకి రావొచ్చని కొందరు గులాబీ నేతలు గుసగుసలాడుతున్నారు.