బడ్జెట్ సమావేశాలకు కూడా ఏపీ ప్రతిపక్ష పార్టీ సభ్యులు అసెంబ్లీకి రావడం అనుమానమే..! ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటేనే అసెంబ్లీకి వస్తామంటూ ప్రతిపక్ష నేత జగన్ శీతాకాల సమావేశాలను బహిష్కరించారు. సరిగ్గా ఆ సమయంలోనే ఆయన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించారు. యాత్ర జరుగుతోంది కాబట్టి, నాయకులు అందుబాటులో ఉండాల్సి అవసరం ఉంది కాబట్టి, సమావేశాలను బహిష్కరించేందుకు కారణంగా జంప్ జిలానీల అంశమే చూపించారు. అంతేకాదు, ప్రజాక్షేత్రం ఉంటూనే ఫిరాయింపులపై పోరాటం చేస్తామన్నారు. తరువాత, ఆ అంశం జోలికే వైకాపా వెళ్లలేదు, ఆ పోరాటం ఏంటనేది కూడా వారికే స్పష్టత లేని అంశంగా మిగిలిపోయింది. ఇప్పుడు, మళ్లీ సమావేశాలు మొదలుకాబోతున్నాయి. కానీ, ఈసారి స్పీకర్ చర్యలు తీసుకుంటే సమావేశాలకు వస్తామంటూ వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నారు.
విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్ ను కలిశామనీ, మరోసారి మెమొరాండమ్ ఇచ్చామన్నారు. పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేల విషయమై వెంటనే చర్యలు తీసుకోవాలనీ, అనర్హులుగా ప్రకటించాలని కోరామన్నారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం అనర్హత పిటీషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆయన గుర్తుచేశామన్నారు. అంతేకాదు, అనర్హత పిటీషన్లపై ఈరోజుకి ఈరోజే చర్యలు తీసుకోవాలన్నారు. అలా చేస్తే, 5న వైకాపా ఢిల్లీలో చేస్తున్న ధర్నా కార్యక్రమం పూర్తి చేసుకుని, ఆ మర్నాడు అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరయ్యే అవకాశం ఉందని తమ పార్టీ అధ్యక్షుడు చెప్పిన నేపథ్యంలో, స్పీకర్ కు చెప్పామన్నారు. సో.. స్పీకర్ వెంటనే చర్యలు తీసుకుంటేనే వైకాపా ఎమ్మెల్యేలు సభకు వస్తారన్నమాట.
నిజానికి, వైకాపా ఎమ్మెల్యేలను సభకు రావొద్దని ఎవ్వరూ చెప్పలేదు కదా! వారి రాజకీయ అవసరాలకు అనుగుణంగా ‘ఫిరాయింపులు’ అనే సాకు చూపించి గౌర్హాజరు అవుతున్నారు. ఇప్పుడు కూడా.. స్పీకర్ మీదకు నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్పీకర్ ను కలిసి చర్యలు తీసుకోమని కోరినా కూడా ఆయన స్పందించలేదు కాబట్టి, గైర్హాజరు అవుతున్నామనే ముందస్తు అనుకూల వాదనను సిద్ధం చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. జంప్ జిలానీలపై చర్యలు కచ్చితంగా ఉండాలి. దాన్ని ఎవ్వరూ సమర్థించరు. కానీ, వారిపై చర్యలు తీసుకోలేదు కాబట్టే అసెంబ్లీకి తాము రావడం మానేస్తున్నాం అనేది సరైన వాదన కాదు. అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయండీ.. ఎవరొద్దంటారు! ప్రజలు కూడా వారిని ఓట్లేసి పంపింది వారు అసెంబ్లీలో మాట్లాడతారనే కదా..!