శ్రీదేవి సంతాప సభని తెలుగు చిత్రసీమ జరపాల్సింది. కానీ.. ఆ ‘ఖర్చు’ లేకుండా చేశారు టి.సుబ్బిరామిరెడ్డి. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో శ్రీదేవి సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీదేవితో అనుబంధం ఉన్న స్టార్ హీరోల్ని, హీరోయిన్లనీ, దర్శకుల్నీ ఆహ్వానించారాయన. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వస్తారని చెప్పారు. కానీ… వాళ్లంతా ఈ సంతాప సభకు డుమ్మా కొట్టేశారు. కృష్ణ లాంటి సీనియర్ నటుడూ రాలేదు. మోహన్ బాబు ఆచూకీ కూడా లేదు. చిరంజీవికి వేరే అప్పాయింట్ మెంట్ ఉందని, ఆయన ఊర్లో లేరని అల్లు అరవింద్ ‘వార్త’ మోసుకొచ్చారు. కృష్ణకు నడుం నొప్పి అట. మోహన్ బాబు కూడా ఊర్లో లేరు. ఆయన ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారు. మరి బాలకృష్ణ, వెంకీ, నాగ్ల మాటేంటి?? తనతో సినిమా చేయకపోయినా.. నాన్నతో సినిమాలు చేసినందుకైనా బాలయ్య రావాల్సింది. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరూ కనిపించలేదు. అమల మాత్రం వచ్చి, తన శ్రద్దాంజలి ఘటించింది. శ్రీదేవితో 24 సినిమాలు చేసిన రాఘవేంద్రరావు జాడ లేకుండా పోయింది. మొత్తానికి స్టార్లెవరూ లేకుండానే సంతాప సభ ముగిసిపోయింది.
ఈ సంతాప సభతో చిత్రసీమ కూడా చేతులు దులుపుకున్నట్టే. ఎందుకంటే `మా` నుంచి కూడా ప్రత్యేకంగా వేరే సంతాప సభలేం లేవు. ‘మేం సంతాప సభ నిర్వహిద్దాం అనుకున్నాం.. కానీ ఆ అవకాశం సుబ్బిరామిరెడ్డిగారు తీసేసుకున్నారు’ అని తేల్చేశారు మా అధ్యక్షుడు శివాజీ రాజా. తెలుగు చిత్రసీమ ఓ అపురూపమైన నటికి ఇచ్చిన గౌరవం ఇది. కనీసం సుబ్బిరామిరెడ్డి సంతాప సభకైనా మిగిలిన స్టార్లంతా వచ్చి ఉంటే బాగుండేది. కానీ.. ఆ అవకాశం కూడా లేకుండా పోయింది.