నాగార్జున, రామ్గోపాల్ వర్మ కాంబినేషన్ అనగానే తెలుగు ప్రేక్షకులకు ‘శివ’ గుర్తుకు వస్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మరో రెండు సినిమాలు చేసినా… ‘శివ’ మేజిక్ రిపీట్ కాలేదు. అసలు, ఇటీవల వర్మ తీసే సినిమాలు ఎందులోనూ దర్శకుడిగా అతడి మార్క్ కనిపించడం లేదు. అదే సమయంలో కథలపై, దర్శకుల ఎంపికపై ఎక్కువ జాగ్రత్త పడుతున్న కింగ్ నాగార్జున వర్మకు ఛాన్స్ ఇచ్చాడు. నాగ్, వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న నాలుగో సినిమా ‘ఆఫీసర్’. దీంతో వర్మ మళ్ళీ పాత మేజిక్ రిపీట్ చేస్తాడని చాలామంది భావిస్తున్నారు. సినిమాలో సంథింగ్ స్పెషల్ ఎలిమెంట్ ఏదో ఒకటి ఉంటుందని, లేదంటే నాగార్జున అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వడని మాట్లాడుకుంటున్నారు. కానీ, వర్మ మాత్రం యధావిధిగా రెగ్యులర్ స్టైల్లో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. సినిమాను చుట్టేస్తున్నట్టు కనిపిస్తోంది. షూటింగుకు గుమ్మడికాయ కొట్టడం ఒక్కటే ఆలస్యం. “రామ్గోపాల్ వర్మ ‘ఆఫీసర్’ షూటింగ్ 99% ఫినిష్ అయ్యింది. ఇప్పటివరకూ షూట్ చేసిన సినిమా పట్ల ఎగ్జయిటింగ్ గా వున్నా. మిస్సింగ్ ఆర్జీవీ అండ్ హిస్ టీమ్” అంబి నాగార్జున ట్వీట్ చేశారు. మైరా సరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా మే 25న విడుదల కానుంది.