వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ఏమాత్రం తగ్గడం లేదు! ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాటమని చెప్పి, ప్రతీరోజూ ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఒక రోజు, లేదా రెండ్రోజులు.. ఆయన చేసిన విమర్శలకు కొంత ప్రాధాన్యత లభించింది. కానీ, ఎప్పుడైతే ముఖ్యమంత్రిని అమ్మ నాన్నల ప్రస్థావన తీసుకొస్తూ విమర్శలు మొదలుపెట్టారో.. అక్కడి నుంచే విజయసాయి వ్యాఖ్యలకు ప్రాధాన్యత తగ్గిపోయిందనడంలో సందేహం లేదు. ఢిల్లీలో విజయసాయి మాట్లాడుతున్నారంటే… చంద్రబాబుపై విమర్శలు తప్ప విషయం ఉండదనే స్థాయికి వచ్చేసింది. ముఖ్యమంత్రిపై అవినీతి ఆరోపణలుగానీ, టీడీపీ ఎంపీ సీఎం రమేష్ బండారం రెండ్రోజుల్లో బయటపెడతానని చేసిన సవాలుగానీ.. ఇలా ఆయన చేసే తీవ్రమైన ఆరోపణలకు ఇంతవరకూ ఆధారాలంటూ ఏవీ చూపలేదు.
సోమవారం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై యథావిధిగా విమర్శలు చేశారు. ఈసారి విజయ్ మాల్యా దగ్గర రూ. 150 కోట్లు పార్టీ విరాళం తీసుకున్నారని ఆరోపించారు. విజయ్ మాల్యా దేశాన్ని వదిలి వెళ్లాక, చంద్రబాబు లండన్ వెళ్లారనీ, ఆయన్ని కలిశారా లేదా అనే విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని విజయసాయి ఆరోపించారు. దీనిపై మరోసారి సీఎం రమేష్ స్పందించి, కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ… ఇలా రోజుకో అంశంతో విజయసాయి రెడ్డి ఎందుకు విమర్శల దాడికి దిగుతున్నారు..? వాటికి ఆధారాలు లేవనే విషయము ఆయనకీ తెలుసు, అలాంటప్పుడు మీడియాలో చర్చనీయాంశంగా ఉండేలా విమర్శలు ఎందుకు చేస్తున్నారు..? చంద్రబాబుపై విమర్శల్ని తెరమీదికి తీసుకొచ్చి, రాజకీయంగా డైవర్ట్ చేయాలనుకుంటున్న అంశం ఏదైనా ఉందా..? అంటే, ఉందనే అనిపిస్తోంది.
మొదటిది, వైకాపా ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం రాజీనామా చెయ్యరట! ఇదే అంశమై వైకాపాలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. విజయసాయి రాజీనామా అంశంపై టీడీపీ దృష్టి వెళ్లనీయకుండా, ముఖ్యమంత్రిపై ఆరోపణలకు దిగుతున్నారనేది కొంతమంది అభిప్రాయం. ఇంకోటి, కేంద్రంపై అవిశ్వాసం పెట్టి, మోడీతో నిత్యం కలుస్తూ ఉండటంతో టీడీపీ ఈ అంశంపై రాష్ట్ర స్థాయిలో తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. రాజకీయంగా ఇది వైకాపాకి ఇబ్బంది కలిగించే అంశమైపోయింది. కాబట్టి, ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే.. టీడీపీ నేతలందరికీ వైకాపాను విమర్శించేందుకు వీలైన వేరే టాపిక్ కావాలి. దాని కోసమే రోజుకోసారి విజయసాయి ఇలా వీరావేశంతో ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.