భాజపా ఎంపీ కంభంపాటి హరిబాబు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గతంలో చెప్పినట్టుగానే.. ఆంధ్రాకు కేంద్రం చేయాల్సిన దానికి మించి సాయం చేసిందీ, దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఏ కేంద్ర ప్రభుత్వమూ ఏ రాష్ట్రానికీ చేయనంత సాయం మోడీ సర్కారు చేసిందన్నారు. టీడీపీ తన సొంత రాజకీయ కారణాలతోనే భాజపాకి దూరమైందన్నారు. వైకాపా ఉచ్చులో టీడీపీ పడిందనీ, వైకాపాకి భాజపా దగ్గర కావడం లేదని హరిబాబు చెప్పారు. ఆ భ్రమ నుంచి తెలుగుదేశం నాయకులు బయటకి రావాలన్నారు. ఒక వైకాపా ఎంపీ ప్రధాని కార్యాలయాన్ని వాడుకుంటున్నారని చేస్తున్న వ్యాఖ్యలు అసంబంద్ధమైనవని హరిబాబు కొట్టిపారేశారు. మోడీ కార్యాలయాన్ని మరొకరు వాడుకోవడానికి అవకాశం ఇస్తారనడం అవివేకం అన్నారు.
ఏపీకి ఇవ్వాల్సినవన్నీ కేంద్రం ఇచ్చేసిందనీ, 85 శాతం హామీలు నెరవేర్చిందన్నారు. మూడో నాలుగో అంశాలు మాత్రమే మిగలున్నాయనీ, వాటిపై త్వరలో స్పష్టత ఇచ్చేస్తుందన్నారు. విభజన తరువాత ఏపీలో ఎన్నడూ లేని విధంగా కేంద్రీయ విద్యా సంస్థలను మోడీ సర్కారు ప్రారంభించిందన్నారు. రైల్వే జోన్ విషయమై త్వరలోనే ప్రకటన ఉంటుందనీ, కడప ఉక్కు పరిశ్రమపై కూడా త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తారని చెప్పారు. ఇక, ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ.. దానికి సమానమైన ప్రయోజనాలను చేకూర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ప్రయోజనాలు కల్పిస్తామని తాము చెబుతున్నా కూడా అందిపుచ్చుకునేందుకు రాష్ట్రం ముందుకు రావడం లేదని చెప్పారు. భాజపాతో టీడీపీ తెగతెంపులు చేసుకున్నది ప్రత్యేక హోదా కోసం కాదనీ, భాజపాకి వైకాపా దగ్గరౌతోందన్న భ్రమతోనే ఎన్డీయే నుంచి బయటకి వచ్చేసిందని చెప్పారు. ఇంకా ఏమంటారంటే… కేంద్రంతో ఉండకపోయినా ఫర్వాలేదూ, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే సాయాన్ని అందిపుచ్చుకోవాలనీ, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని తాము కోరుతున్నట్టు హరిబాబు చెప్పారు.
కేంద్రంతో చంద్రబాబు ఎందుకు తెగతెంపులు చేసుకున్నారనేది ఏపీలో ప్రతీ సామాన్యుడికీ తెలుసు. రాష్ట్రానికి ఇస్తామన్న హామీలను భాజపా నెరవేర్చలేదు, చివరి బడ్జెట్ లో మొండి చేయి చూపింది.. ఇవీ అసలు కారణాలు. అంతేగానీ.. భాజపాకి వైకాపా దగ్గరౌతోందన్న భ్రమతో కేంద్రంలో అధికార పార్టీని టీడీపీ వదులుకుందనే వాదనలో ఏమైనా అర్థముందా..? ఈ కారణంతో టీడీపీ పొత్తు తెంచుకుందని చెబితే ఎవరైనా నమ్ముతారా..? ఉన్నట్టుండి ఈ వాదన హరిబాబు ఎందుకు ఎత్తుకున్నారంటే… ఏపీకి భాజపా అన్యాయం చేసిందీ, అందుకే సహజ మిత్రపక్షమైన టీడీపీ ఎన్డీయే నుంచి తప్పుకుందనే చర్చ ఇప్పుడు జాతీయ స్థాయి అంశమైపోయింది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. కాబట్టి, వారి వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవాలంటే.. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకి వెళ్లడానికి వేరే కారణం ఉందని సాకులు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ క్రమంలో ఇలాంటి పేలవమైన వాదనను హరిబాబు తెరమీదికి తెస్తున్నట్టుగా ఉంది.