ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. గత పర్యటనల కంటే ఇది చాలా భిన్నమైందని చెప్పాలి. ఢిల్లీలో కూడా చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. గతంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీ అధ్యక్షుడిగా వెళ్లేవారు. కానీ, ఇప్పుడు అదే ఎన్డీయేతో రాష్ట్ర ప్రయోజనాల అంశమై విభేదించాల్సి వచ్చింది. దీంతో తాజా ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అన్నిటికీ మించి ఆంధ్రా పట్ల కేంద్రం చూపుతున్న వివక్షపై ఇప్పుడు జాతీయ స్థాయి అటెన్షన్ తీసుకొచ్చినట్టు అయింది. అందుకే భాజపా నేతలు ఓర్వలేకపోతున్నారనేది విష్ణుకుమార్ రాజు మాటల్లో కనిపిస్తోంది. పార్లమెంటుకు వెళ్లగానే చంద్రబాబు మెట్లకు మొక్కారు. అయితే, పార్లమెంటు మెట్లకు మొక్కితే మోడీకి మొక్కినట్టేనంటూ విష్ణుకుమార్ వ్యాఖ్యానించడం గమనార్హం.
చంద్రబాబు తన పర్యటనలో భాగంగా అకాళీదళ్, తృణమూల్, శివసేన, ఎన్సీపీ, సమాజ్ వాదీ, బీజేడీ వంటి ప్రముఖ పార్టీల నేతల్ని కలుసుకున్నారు. సీనియర్ నేత శరత్ పవార్ తన కుమార్తెతో సహా చంద్రబాబుతో మాట్లాడారు. ఏపీ సమస్యలపై సంఘీభావం వ్యక్తం చేశారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందనీ, తెలుగుదేశం చేస్తున్న పోరాటానికి తామంతా మద్దతుగా ఉంటాయని పలువురు ఎంపీలు మద్దతు ప్రకటించారు. అంతేకాదు, చంద్రబాబును కలిసినవారిలో కాంగ్రెస్ కి చెందిన నేతలు కూడా ఉండటం విశేషం. వీరప్ప మొయిలీ, జ్యోతిరాదిత్య సింధియాలు ఏపీ సీఎంని కలిశారు. ఆ తరువాత, విభజన చట్టం రూపకర్తల్లో ఒకరైన జైరామ్ రమేష్ కూడా వచ్చారు. పోలవరం తన వల్లనే వచ్చిందని జైరామ్ అంటుంటే, షరతులు కూడా మీరు పెట్టినవే కదా అని చంద్రబాబు సమాధానం ఇచ్చారు.
మొత్తానికి, చంద్రబాబు పర్యటనకు అనూహ్య స్పందన వచ్చిందనే చెప్పాలి. అయితే, ఈ స్పందనను ఏపీ ప్రయోజనాల సాధనకు అనుగుణంగా, భాజపాపై పోరాటానికి అస్త్రంగా మలుచుకోవాల్సి ఉంది. భాజపాతో సహజంగా వ్యతిరేకించే పార్టీల నుంచి టీడీపీకి మద్దతు బాగానే వస్తోంది. ఈ మద్దతుతో కేంద్రంపై టీడీపీ పోరాటం ఎలా ఉండాలనేదానికి కార్యరూపం రావాల్సి ఉంది. ఎలాగూ అవిశ్వాస తీర్మానాలతో ఒరిగేదేమీ ఉండదనేది అర్థమైపోయింది. ప్రతీరోజూ పార్లమెంటు వాయిదా పడటం అనేది పరిపాటి అయిపోయింది.
ఏపీపై అనుసరించిన నిర్లక్ష్య వైఖరి.. ఈ స్థాయికి వస్తుందని భాజపా పెద్దలు ఊహించి ఉండరు. ఇతర రాష్ట్రాల నుంచీ ఈ తరహా మద్దతును టీడీపీ కూడగట్టగలదని ఊహించినట్టు లేదు. అందుకే, ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో భాజపా నేతలంతా విమర్శలకు దిగుతున్నారు. జీవీఎల్, ఎంపీ హరిబాబు, విష్ణుకుమార్ రాజు మూకుమ్మడిగా ఏపీకి చాలా చేశామనీ, రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఎన్డీయేకి దూరమయ్యారంటూ ఊదరగొడుతున్నారు.