అనుకున్నట్టుగానే జరిగింది..! కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం పార్లమెంటులో చర్చకు నోచుకోలేదు. ఆంధ్రాకు కేంద్రం అన్యాయం చేస్తోందనీ, విభజన హామీలు నెరవేర్చలేదనీ, ఇస్తామన్న నిధులనూ ఇవ్వలేదన్న ఆవేదనతో మిత్రపక్షమైన టీడీపీ ఎంపీలు ఎదురు తిరగడంతో సభాపర్వంలో గందరగోళం మొదలైంది. అక్కడి నుంచి అవిశ్వాస తీర్మానాలు ప్రతీరోజూ చర్చకు రావడం, వాయిదా పడటం ఒక రొటీన్ తంతు అయిపోయింది. చివరికి, ఈరోజున సభ నిరవధికంగా వాయిదా పడిపోయింది. దీని ద్వారా దేశ ప్రజలకు మోడీ సర్కారు ఇచ్చిన సందేశమేంటి..? విపక్షాలన్నీ ఏకమైనా కూడా సభలో మాట్లాడకుండా ప్రధానమంత్రే తప్పించుకుని తిరిగితే సగటు పౌరుడు ఏమని అర్థం చేసుకోవాలి..? సభలో తిరుగులేని మెజారిటీ ఉంచుకుని కూడా ఓటింగ్ కి మోడీ ఎందుకు భయపడ్డారు..? నిలబడి మాట్లాడేందుకు ఎందుకు సాహించలేకపోయారు..? ఇప్పుడీ చర్చలన్నింటికీ ఆస్కారం ఇచ్చేట్టుగా ప్రధాని తీరు కనిపిస్తోంది.
ఒక్కటైతే ఘంటాపథంగా చెప్పొచ్చు… ఆంధ్రాకు తమ సర్కారు అన్యాయం చేసిందని భాజపా ఒప్పుకున్నట్టే..! విభజన హామీలను నెరవేర్చలేదనీ, ఇస్తామన్న నిధులనూ సక్రమంగా తాము ఇవ్వలేదన్నది కూడా ఒప్పుకున్నట్టే. ఆ వైఫల్యం గురించి మాట్లాడాలంటే ముఖం చెల్లదు కాబట్టి, మాట్లాడేందుకు వారి దగ్గర విషయం లేదు కాబట్టి… అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన లేక, సభ నుంచి అధికార పక్షమే తప్పించుకుందనడంలో సందేహం లేదు. అవిశ్వాసానికి అనుమతి ఇచ్చి.. చర్చ చేపట్టి ఉంటే ఏం జరుగుతుంది..? మహా అయితే ఓటింగ్ జరుగుతుంది. విపక్షాలన్నీ ఏకమైపోయినా మోడీ సర్కారు పడిపోయే పరిస్థితైతే లేదు కదా! అలాంటప్పుడు అవిశ్వాసాన్ని ఎదుర్కొని.. చర్చకు దిగాల్సింది. ఆంధ్రాకు అన్యాయం చేయలేదని ప్రెస్ మీట్లలో భాజపా నేతలు చెబుతున్నదే… సభలో ప్రధానమంత్రి మరింత ధారాళంగా చెప్పే అవకాశం ఉంది కదా. దాన్ని కూడా ఎందుకు వదిలేసుకున్నట్టు..?
అవిశ్వాసం నుంచి తప్పించుకోవడం ద్వారా తమ చేతగాని తనాన్ని బయటపెట్టుకున్నట్టయింది. ఉభయ సభల్నీ గందరగోళం లేకుండా నడిపించాల్సిన బాధ్యత అధికార పార్టీకి ఉంటుంది. సభలో ప్రతిష్టంభన నెలకొంటే.. ఆయా పార్టీల నేతలతో స్పీకర్ చర్చించాలి. అప్పటికీ వినకపోతే ప్రధానమంత్రి మాట్లాడాలి. కానీ, ఆ పనిచెయ్యలేదే..! అంటే, సభ నడపడం తమకు చేతగాదని కూడా ఒప్పుకున్నట్టు భావించాలా..? అలాంటప్పుడు అధికార పార్టీగా భాజపా ఎందుకు ఉన్నట్టు..? ఆంధ్రాకి మోడీ సర్కారు అన్యాయం చేసింది.. అందుకే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనలేకపోయిందనే విమర్శలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తడమైతే ఖాయం. మేము ఫెయిల్ అయ్యాం.. ఇదే భాజపా ఇచ్చిన సందేశం.