శుక్రవారం నాడు విజయవాడ రహదారులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిపిఎం కార్యదర్శి మధు, సిపిఐ నేత రామకృష్ణలతో కలసి నడవగా వేలాది మంది యువత పాల్గొనడం ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక సంచలన పరిణామం. ఢిల్లీలో వైసీపీ ఎంపిల రాజీనామాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేశ్ తదితర మంత్రులు సైకిల్ యాత్రలకన్నా ఇదే ప్రధానాకర్షణగా మారిపోవడం చాలా సహజంగా జరిగిందే. ఆ స్థాయి నట నాయకుడు పోరాటాలకు పేరు గాంచిన కమ్యూనిస్టులతో కలసి నడిరోడ్డుపైకి రావడం ఇటీవలి కాలంలో ఒక సంచలనమైంది. గతంలో ఎన్టీఆర్, చిరంజీవి వంటి వారు కూడా పార్టీలు పెట్టి ప్రచారం చేసినా ఆ పరిస్తితులు వేరు. ఇప్పటి సందర్భం వేరు. వాస్తవానికి గత కొద్ది మాసాలుగా ఎవరు ఎక్కడ కలిసినా రాజకీయాలు ఎలా వుంటాయి అనే చర్చ మొదలు పెట్టి పవన్పాత్ర కీలకం కాబోతుందనే నిర్ధారణతో ముగుస్తున్నది. నిజానికి 2014 ఎన్నికల్లోనూ టిడిపి బిజెపి కూటమి వెంట్రుక వాసి ఓట్ల తేడాతోనైనా గెలవడం వెనక ప్రధాన ప్రభావం పవన్‌దేనని అందరూ అంగీకరించిన విషయం.తను బలపర్చిన కూటమి గెల్చినా ఆయన కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఎలాటిపదవులు ప్రతిఫలాలు కోరకుండా ప్రజలు రాష్ట్రం అని మాత్రమే మాట్లాడుతూ వచ్చారనేది నిజం.
ప్రత్యేక హౌదా సమస్యను ప్రజ్వలింపచేయడంలోనూ జగన్ కన్నా ఎక్కువగా పవన్ కేంద్రాన్ని నేరుగా అనగలిగిేన మాట నిజం. అప్పట్లో వైసీపీ వారు టిడిపికి పవన్‌కు సంబంధం వుందని ఆరోపిస్తుండేవారు.అయితే సమస్యలపై స్పందన కొనసాగించడమే గాక తెలుగుదేశంపైనా అందులోనూ లోకేశ్‌పైన కూడా విమర్శలు సంధించిన జనసేనాధిపతి పాలక ప్రధాన ప్రతిపక్షాలను సమానంగా కలవరపర్చారు. ఒక మేరకు దీన్ని వైసీపీ ఆహ్వానించినా జనసేన ప్రధానంగా ముందుకు రావడం మింగలేకపోయింది. అందుకే సాక్షి మీడియా ఆయన వ్యాఖ్యలపై ఎక్కడ లేని శోధన చేస్తూ ఆచితూచి అతి పరిమితంగా ఇస్తూ వస్తున్నది. ప్రత్యేక హౌదా సమస్యపై పోరాడిన ఒకే ఒక్కడు జగన్ అని ఆ ఛానల్ కథనం వేస్తే నేను విభేదించాను. ప్రత్కేక హౌదా సమితి వామపక్షాలు జనసేన కూడా ఇందులో పాత్ర వహించాయి. పవన్ లోకేశ్‌పై ఆరోపణలను ప్రస్తావిస్తారని తెలియనంతవరకూ అంటే ఆయన జెఎఫ్సి దశ వరకూ టిడిపి దాని అనుకూల మీడియా విపరీతమైన ప్రచారమిచ్చి జగన్‌కు వ్యతిరేకంగా నిలబెట్టాలని చూశాయి. వాస్తవానికి జెఎప్సిపై నేనే ఫ్యాక్ట్ కమిటీ కాదు ఫైటింగ్ కమిటీ కావాలని అన్నాను. ఆయన ఫైటింగ్ మొదలు పెట్టేసరికి పరస్పర శత్రువులైన టిడిపి వైసీపీ రెండూ భరించలేకపోతున్నాయి. అనుభవం లేదంటున్నా వ్ణాస్తవాలు తెలుసుగనకే పవన్ మొదటి నుంచి కమ్యూనిస్టుల పట్ల గౌరవంగా మాట్లాడుతూ వచ్చారు. అందుకే ఆయనను వారు మోస్తున్నారని తిట్టిపోసే వారూ వున్నారు. అదే కమ్యూనిస్టులు టిడిపితోనో కాంగ్రెస్‌తోనో సర్దుబాట్టు చేసుకున్నప్పుడు గొప్పగా చెప్పేవారు. కాని జనసేన జనాకర్షణకు కమ్యూనిస్టుల సమరశీలత తోడవడం ఈ పార్టీలు వారి మీడియాలు భరించలేకపోతున్నాయి. పవన్ ఇప్పటికి టిడిపి తొత్తు అని వైసీపీ లోపాయికారిగా చెబుతుంది. ఆయనకు బిజెపి తోడ్పాటువుందని టిడిపి వర్గాలు ఆరోపిస్తాయి.
అదే నిజమైతే ఆయన కమ్యూనిస్టులతో కలసి పనిచేయడం వారు ఆయనతో చేతులు కలపడం సాద్యమయ్యేవేనా? సమస్య ఏమంటే టిడిపి వైసీపీ తప్ప మూడోశక్తి ఎక్కిరావడం ఈ ఉభయులకూ ఇష్టం లేదు. పైగా అభద్రత కూడా వుంది. ఆందోళన పెరుగుతున్నది. అయితే ఎవరు ఏమనుకున్నా కొత్త రాజకీయ పవనాలు వీయడానికి ఈ కలయిక కదలిక దారి తీస్తాయన్నది కాదనలేని వాస్తవం. రాజకీయ సామాజిక కోణాలలో కొత్త శక్తులు రావడమే గాక యువతను కదిలించడంలో కూడా జనసేన పాత్ర బాగా వుండబోతున్నది. దానికి విజయవాడ పాదయాత్ర ప్రారంభం కావచ్చు. వెనకబడిన ప్రాంతాలలో జరిగే సదస్సులు సమావేశాలు ఈ వాతావరణాన్ని ఇంకా ఉధృతం చేస్తాయి.ఎటూ తోచని స్థితిలో ప్రభుత్వ అఖిలపక్షంలో కలసి పనిచేయడానికి అంగీకరించిన హౌదా సమితి చలసాని శ్రీనివాస్ వంటి వారు కూడా ఇటు వైపు రావలసిన అవసరం గుర్తించవలసి వస్తుంది. వచ్చే ఎన్నికల ఎజెండాను జనసేన వామపక్షాల కూటమి నిర్ధారించే పరిస్థితి వస్తుంది. వైసీపీ బహుశా తన బలం కాపాడుకోవడానికి పెనుగులాడాల్సి వుంటుంది. ఇక టిడిపి అధినేత ఎన్ని విన్యాసాలు చేసినా గతంలో బిజెపి ప్యాకేజీకి వంత పాడినందుకు విచారం వెలిబుచ్చి ఇప్పుడు పోరాడే వారిని గౌరవిస్తే తప్ప ప్రజలు ఆమోదించడం కష్టం. పవన్‌ను బిజెపి ఏజంటుగా చిత్రించడమంటే కోట్లాది ప్రజలలో కోరి వ్యతిరేకత పెంచుకోవడమే.