మొన్నటికి మొన్న సమంతకి పరికిణీలో చూశాం. అంతకు ముందు రాజుగారి గదిలో.. నల్లని చీరలో మరోలా కనిపించింది. ఇప్పుడు మొత్తంగా తన గెటప్ మార్చేసింది. కళ్లజోడు, వాలుజడ, ముక్కు పుడక… కుర్తా లాంటి గౌను.. ఇలా మనల్ని బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోకి తీసుకెళ్లిపోయింది. సావిత్రి జీవిత కథని మహానటి పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తుంటే, సమంత ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె పేరు.. మధురవాణి. బీఏ గోల్డ్ మెడలిస్ట్. ఈ సినిమాలో జర్నలిస్టుగా కనిపించబోతోంది. ఈ సినిమాలో సమంత లుక్ ఇప్పుడు విడుదల చేసింది చిత్రబృందం. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ల లుక్స్ తరవాత.. బయటికి వచ్చిన లుక్ ఇదే. ఇప్పటి వరకూ సమంత నటించినచిత్రాల్లో, అందులో ఆమెకు సంబంధించిన లుక్స్‌లో.. మధురవాణి లుక్ కచ్చితంగా భిన్నమైనదే. చిత్రీకరణ పూర్తయిన మహానటి.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మే 9న ఈ చిత్రం విడుదల కాబోతోంది.