జనసేన పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. విభజన సమస్యలపై పోరాటం చేయడంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయనీ, అందుకే తాము పాదయాత్ర చేయాల్సి వచ్చిందని విజయవాడలో పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెదేపా, వైకాపాలు వారి వ్యక్తిగత కారణాల వల్లనే ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి తాను తిరుపతిలో సభ పెడితే, ఆ తరువాతే ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందన్నారు. ఆ ప్యాకేజీ బాగులేదనీ, దాన్ని పాచిపోయిన లడ్డులతో తాను ఆనాడే పోల్చితే.. అదే అద్భుతం అని ముఖ్యమంత్రి అన్నారని చెప్పారు. ఏపీ ప్రయోజనాల విషయమై కేంద్రాన్ని ప్రశ్నించాలంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా తానే సూచించాననీ, గడచిన వారంపదిరోజులోగా పార్లమెంటు స్తంభించే పరిస్థితి వచ్చిందన్నారు.
అఖిల పక్షం గురించి పవన్ మాట్లాడుతూ… ఏడాది కిందటే అఖిల పక్షం గురించి టీడీపీ మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. ఇప్పుడు దాంతో ఉపయోగం ఏముంటుందని ప్రశ్నించారు. అఖిలపక్షం మీటింగ్ పై నమ్మకం పోయిందనీ, దాని వల్ల ఏం ఒరుగుతుందో తనకు అర్థం కావడం లేదని పవన్ అన్నారు. ముఖ్యమంత్రి పిలిచారని వెళ్లి, ఒక కాఫీ తాగి రావడం తప్ప.. దాన్లో నిర్మాణాత్మక పోరాట వ్యూహం తనకు కనిపించడం లేదన్నారు. ప్రత్యేక హోదాను ఎలా సాధిస్తారనేది ముందుగా జనసేన ప్రతినిధులతో క్యాబినెట్ మంత్రులు చర్చించాల్సి ఉందన్నారు. ఆ తరువాత, తమ ఆలోచనా విధానాన్ని తెలియజేస్తామన్నారు. పార్లమెంటు వాయిదా పడిపోయిన ఈ తరుణంలో ఎలా ముందుకు వెళ్లాలనే స్పష్టత తమకు ఇవ్వాలన్నారు.
తిరుపతిలో పవన్ ప్రత్యేక హోదా గురించి అడిగారు… ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. తాజాగా కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని కూడా పవనే ముందుగా చెప్పారు కదా! ఆయన వల్లనే పార్లమెంటు సమావేశాలు స్తంభించిపోయే పరిస్థితి వచ్చింది కదా! ఇవన్నీ పవన్ ముందుగానే చెప్పినప్పుడు… అఖిల పక్షం గురించి కూడా ఏడాది ముందే సలహా ఇస్తే సరిపోయేది! అప్పుడు పెట్టి ఉంటే బాగుండేదని ఇప్పుడు ఎందుకు వాపోవడం..? సరే.. ప్రస్తుతం టీడీపీ పిలుస్తున్న అఖిల పక్షానికి ఎందుకు వెళ్లరంటే… హోదా ఎలా సాధిస్తారనే స్పష్టత ముందుగా ఇవ్వాలట..! దాని కోసమే కదా అఖిల పక్షం పిలిచింది. పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడిందీ, భాజపా తీరు దారుణం ఉందీ, అన్ని పార్టీలూ కలిసి ఏం చేద్దామని చర్చించడం కోసమే కదా పిలుస్తున్నది. వెళ్లకుండానే స్పష్టత ఇవ్వాలీ, పోరాటం ఎలాగో చెప్పాలంటే ఎలా సాధ్యమౌతుంది..? సలహాలు తీసుకునేందుకే కదా పిలుస్తున్నది..!