ఏపీ విషయంలో భాజపా ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయంగా అస్థిరత సృష్టించడం ద్వారా లబ్ధి కోసం పాకులాడుతోందనే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు..! అయితే, భాజపా వ్యూహానికి స్థానికంగా సహకరిస్తున్న రాజకీయ శక్తులేంటో చూస్తూనే ఉన్నాం. ఇది చాలదన్నట్టుగా, ఇదే అదను అనుకుని ప్రభుత్వంపై విమర్శలు చేసే పనిని ఐవైఆర్ కృష్ణారావు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. రాజధానిపై విద్వేషాలను చిమ్ముతూ తాజాగా ఓ పుస్తకం రాశారు. దాన్ని జనసేనాని పవన్ కల్యాణ్, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటివారు ఆవిష్కరించారు.
తాజాగా ఐవైఆర్ విమర్శ ఏంటంటే.. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ఒక వర్గానికి లబ్ధి చేకూర్చే విధంగా ప్రకటించారంటూ వ్యాఖ్యానించడం! అయితే, ఏ ప్రాతిపదికన ఆయన ఇలా విమర్శించారనే అంశంపై టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అసెంబ్లీ దగ్గర మాట్లాడారు. రాజధాని ప్రాంతంపై ఆయనకి అవగాహన లేదని విమర్శించారు. 1978 నుంచి తాడికొండ నియోజక వర్గం ఎస్సీ రిజర్వుడ్ గా ఉందని చెప్పారు. ‘రాజధాని నియోజక వర్గం పరిధిలో 75 వేల మంది ఎస్సీ ఓటర్లు, ముస్లింలు 50 వేలమంది, బీసీ ఓటర్ల సంఖ్య 40 వేలు, ఓసీలు 35 వేలు’ అని శ్రావణ్ కుమార్ వివరాలను వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చినవారంతా సన్న చిన్నకారు రైతులేనని చెప్పారు. 26 వేలమంది భూములిస్తే అందులో 800 మంది మాత్రమే ఐదెకరాలకు మించి పొలం ఇచ్చారని చెప్పారు.
సో.. ఒక వర్గానికి ప్రయోజనం చేకూర్చే విధంగా రాజధాని ప్రకటించారని ఐవైఆర్ ఆరోపించారు కదా! మరి, ఓసీల జనాభా కేవలం ముప్ఫై ఐదువేలు మాత్రమే ఉండటం గమనార్హం. ఇక, రాజధాని భూముల విషయానికొస్తే… ఈ భూములు రాజధాని నిర్మాణానికి అనుకూలమైనవి కాదని ఐవైఆర్ ప్రభుత్వంలో ఉండగా ఎందుకు చెప్పలేదన్న ప్రశ్న కూడా టీడీపీ నుంచి వినిపిస్తోంది. ఈ ప్రాంతం రాజధాని అనుకూలం కాదని తెలిస్తే.. నాడే చెప్పాలి కదా మరి! అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్న ఐవైఆర్ వెనక కొన్ని అదృశ్య శక్తులు ఉన్నాయనీ, రాష్ట్రాన్ని అస్థిరపరచాలన్న కొంతమంది ఆయనకు మద్దతు ఇస్తున్నారన్నది టీడీపీ నేతల విమర్శ.
రాష్ట్రం సమస్యల్లో ఉన్నప్పుడు ఐవైఆర్ లాంటి అనుభవజ్ఞులు వీలైతే ప్రభుత్వానికి సహకరించే పనులు చేయాలి. వ్యక్తిగత ఆవేశాలేవైనా ఉంటే తరువాత చూసుకోవాలి. కానీ, రాష్ట్రాన్ని సమస్యలు చుట్టుముట్టిన ఈ సమయంలో వారూ విమర్శలకు దిగడమూ, ప్రభుత్వాన్ని మరింత ఇబ్బందిపెట్టే విధంగా రాజకీయ పరిస్థితులను ఎగదోసేలా ప్రయత్నించడం సరైనదా కాదా అనేది వారే ఆలోచించుకోవాల్సిన అంశం!