వైకాపా ఎంపీలు ఐదుగురూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత జగన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్రం కోసం తమ పదవుల్ని త్యాగం చేసిన ఐదుగురు ఎంపీలను పాండవులతో పోల్చారు జగన్..! ఐదుగురు లోక్ సభ సభ్యులు రాజీనామా చేయడం, వెంటనే నిరాహార దీక్షకు కూర్చోవడం అనేది దేశచరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చని జగన్ చెప్పారు. ఇదొక చరిత్ర, ఇదొక త్యాగం అని అభివర్ణించారు. హోదా రావాలనీ, హోదా తేవాలనీ, కేంద్రం దిగిరావాలని తమ పార్టీ ఎంపీలు చేసిన ప్రయత్నం ఇదన్నారు. హోదా కోసం తమ పార్టీ నాలుగేళ్లుగా ప్రయత్నించిందన్నారు. ఆఖరి అస్త్రంగా రాజీనామాలు చేస్తామని చెబుతూ వచ్చామనీ, ఆ మాట నిలబెట్టుకున్నామన్నారు (నోట్ దిస్ పాయింట్).
కేంద్రంపై గళం విప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆఖరి అస్త్రం ప్రయోగించామన్నారు. దీన్లో చంద్రబాబు నాయుడు భాగస్వాములు అయి ఉంటే, ప్రత్యేక హోదా వచ్చి ఉండేదన్నది తమ గట్టినమ్మకమన్నారు (నోట్ దిస్ పాయింట్). 25 మంది ఎంపీలూ ఒకేసారి రాజీనామా చేసి ఉంటే.. దేశమంతా చూసేదన్నారు. అదే పని చేసి ఉంటే హోదా వచ్చే అవకాశాలు చాలాచాలా మెరుగయ్యేవి అన్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు కోసం అన్ని పార్టీల ఎంపీలను వైకాపా నేతలు కలిశారనీ, అందర్నీ ఒప్పించి మద్దతు కూడగట్టారని జగన్ అన్నారు. బహుశా, మోడీ ప్రభుత్వం మీద మొట్టమొదటి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ఎవరంటే… వైకాపా అనేది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అన్నారు (నోట్ దిస్ పాయింట్). టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకపోవడం, వైకాపా ఎంపీలతో కలిసి నిరాహార దీక్షకు రాకపోవడం అన్నిటికన్నా బాధాకరమైన అంశమని జగన్ అన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించకపోవడానికి కారణం.. చంద్రబాబు చేసిన అవినీతి మీద కేంద్రం విచారణ జరిపిస్తుందేమోననే భయమనీ, ఆ సమయంలో తన ఎంపీలు తన కోసం పార్లమెంటులో గొడవ చేయాలని ఆపారని జగన్ ఆరోపించారు (నోట్ దిస్ పాయింట్). దాని కోసమే, ఎంపీలు రాజీనామా చేస్తే హోదా వస్తుందని తెలిసీ చేయించలేదని జగన్ అన్నారు. ఇంకా.. రొటీన్ వ్యక్తిగత విమర్శలూ అన్నీ షరా మామూలే.
పాయింట్ నంబర్ వన్… మొదట్నుంచీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని చెబుతూ వచ్చాం, మాట నిలబెట్టుకున్నాం అని జగన్ చెప్పారు. ఈ క్రమంలో వారు సాధించింది ఏంటనేది జగన్ చెప్పలేదు, చెప్పలేరు! మాట నిలబెట్టుకోవడం ఒక్కటేనా ఇక్కడి వైకాపాకి ముఖ్యం. తద్వారా ఏం సాధించామన్నది అవసరం లేదా..? పాయింట్ టు.. టీడీపీ ఎంపీలు కూడా తమతో కలిసి రాజీనామా చేస్తే, హోదా వచ్చే అవకాశాలుండేవన్నారు. అంటే, వైకాపా ఎంపీల రాజీనామాల వల్ల ఏమీ జరగదని ఒప్పుకున్నట్టే కదా. పాయింట్ త్రీ… మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం అనేది చరిత్రలో నిలిచిపోయే ఘట్టమట! అంటే, సెలబ్రేషన్ కోసమా ఇదంతా చేసింది..? అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడం ఒక్కటేనా చారిత్రక ఘట్టమంటే..? దాని మీద చర్చ జరగలేదన్న బాధ, ఈ క్రమంలో ఆంధ్రాని భాజపా తొక్కేస్తున్న తీరుపై జగన్ కి ఆవేదన లేదా..? పార్లమెంట్లో భాజపా తీరు గమనిస్తూ సగటు ఆంధ్రుడు రగిలిపోతుంటే… జగన్ కు ఇదో చారిత్రక ఘట్టంగానో, మైలురాయిగానో కనిపిస్తోందా..? లాస్ట్ పాయింట్… టీడీపీ ఎంపీలు ఇప్పుడు రాజీనామా చేయకపోవడానికీ, చంద్రబాబుపై అవినీతి ఆరోపణలున్నాయనీ, వాటిపై చర్యలు మొదలైతే అప్పుడు పోరాడేందుకు ఎంపీలు అవసరమని జగన్ ఆరోపించడం. ఇంతకీ, ముఖ్యమంత్రిపై అవినీతి ఆరోపణలు ఏవీ..? ఆరోపిస్తున్నారే తప్ప ఆధారాలు బయటపెట్టరే!
దేశమంతా మోడి సర్కారు తీరుపై ముక్కున వేలేసుకుంటోంది.. ఒక్క జగన్ తప్ప! ఆంధ్రాకి కేంద్రం చేసిన అన్యాయానికి భయపడే అవిశ్వాసాన్ని మోడీ ఎదుర్కొన లేకపోయారని దేశం అంటోంది.. ఒక్క జగన్ తప్ప! మోడీ నియంతృత్వ ధోరణులపై చాలామంది విమర్శలు చేస్తున్నారు.. ఒక్క జగన్ తప్ప! ఆంధ్రాకి జరిగిన అన్యాయం గురించి పార్లమెంటులో మాట్లాడే దమ్మూ ధైర్యమూ మోడీ సర్కారు లేదని అర్థమైపోయింది.. ఒక్క జగన్ కి తప్ప! రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా సొంత రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడే ప్రతిపక్ష నేత చరిత్రలో ఎవ్వరూ ఉండరేమో..ఇలా ఒక్క జగన్ తప్ప..! సుదీర్ఘ ప్రెస్ మీట్ లో చంద్రబాబు నామస్మరణమే తప్ప, రాష్ట్ర ప్రయోజనాలను కాలరాస్తున్న కేంద్రంపైనా మోడీపైనా విమర్శలు చేయని వ్యక్తి ఏపీలో ఎవరైనా ఉన్నారంటే.. అది ఒక్క జగన్ తప్ప.