పరస్పర వైరుధ్యాల మధ్యనా టిడిపి వైసీపీ పార్టీలు పవన్ కళ్యాణ్ జనసేనపై దాడి చేయడంలో ఉమ్మడిగా వ్యవహరిస్తున్నారు.ఇప్పుడు వైసీపీతో పాటు జనసేనను కూడా కలిపి విమర్శించడం చెల్లుబాటు కావడం లేదు. లోకేశ్‌పై విమర్శ చేసే వరకూ పవన్ కళ్యాణ్‌ను ఎర్రతివాచీతో ఆహ్వానించిన వైనాలు గుర్తు చేస్తున్నారు. ఒకప్పుడు అమెరికా అద్యక్షుడు బుష్ మీరు ఉగ్రవాదులతో వున్నారా మాతోనా అని అడిగినట్టే చంద్రబాబు కూడా మీరు కేంద్రంతో వున్నారా ఆంధ్ర ప్రదేశ్‌తో వున్నారా అని ప్రశ్నించడం హాస్యాస్పదంగా మారింది. ఎందుకంటే మొన్నటి వరకూ కేంద్రంలో రాష్ట్రంలో వారే కలసి పాలించారు. పవన్ కళ్యాణ్ వారిని ఎన్నికల్లో బలపర్చి వుండొచ్చు గాని తర్వాత అధికార చట్రంలో భాగం కాలేదు గనక పోల్చడానికి లేదు.హౌదా విషయంలో ి కొందరు బిజెపిని కొందరు టిడిపిని కాపాడాలని చూస్తున్నప్పుడు రెంటికీ అతీతంగా కమ్యూనిస్టులు జనసేన కలసి కదం తొక్కడం కొత్త చైతన్యం నింపింది. ఈ కొత్త శక్తులూ కదలికలూ మింగుడుపడని టీడీపీ వైసీపీ బీజెపిలు రక రకాలుగాప్రచారాలు చేస్తున్నాయి. పవన్‌కు బిజెపికి ముడిపెట్టి మాట్లాడేవారు కొందరైతే కమ్యూనిస్టులు సీట్లకోసం ఆయనతో చేరారని ఆరోపించేవారు ఇంకొందరు. పవన్‌కు బిజెపి సహాయం చేస్తున్నదని కొందరు మీడియా మిత్రులు నాతో అన్నారు. అదే నిజమైతే ఆయన కమ్యూనిస్టులకు దగ్గరవుతారా అనే కనీస ప్రశ్న కూడా వారికి అవసరం లేదు. అందుకే వాటిని తీవ్రంగా తీసుకునే అవకాశం కూడా వుండదనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ పట్ల సద్భావనే పెరిగే అవకాశమే ఎక్కువ.