తెలుగు సినిమా రూపు రేఖలు మారుతున్నాయి. కమర్షియల్ పంథాకి కాస్త జరిగి… ఏదో కొత్తగా చెప్పాలన్న ప్రయత్నం కనిపిస్తోంది. ఓ సీరియెస్ విషయాన్ని, స్టార్ డమ్‌తో ముడిపెట్టి వెండి తెరపై ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోంది. దానికి తాజా ఉదాహరణ ‘భరత్ అనే నేను’. ఇది ఓ ముఖ్యమంత్రి కథ అని ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. ఆ మూడ్‌కి తగ్గట్టుగానే ప్రచారం జరుగుతోంది. ట్రైలర్లో కూడా.. ‘ఆ సీరియెస్ నెస్’ పుష్కలంగా కనిపించింది. భరత్ అనే సీఎమ్.. ఎటిట్యూడ్, అతనికి ఎదురయ్యే సవాళ్లు, దాన్ని దాటుకుని వచ్చే తత్వం, రాజకీయాల్లో ఉన్న కుళ్లు కుతంత్రం… ఇవన్నీ ప్రతీ ఫ్రేమ్‌లోనూ కనిపించేలా ట్రైలర్ డిజైన్ చేశాడు దర్శకుడు కొరటాల శివ. ఈమధ్య కాలంలో ఓ స్టార్ హీరో, ఓ స్టార్ దర్శకుడు చేసిన ఇంత సీరియెస్ ఫిల్మ్ ఇదేనేమో అనిపించేలా ఉంది ట్రైలర్. డ్యూయెట్లకు, కామెడీ పంచ్‌లకూ స్థానం లేకుండా.. తన ఇంటెన్సిటీ చెడగొట్టకుండా దర్శకుడు చాలా జాగ్రత్త తీసుకున్నాడనిపిస్తోంది. యాక్షన్ ప్రియులకు కావల్సినంత మసాలా ఉందన్న సంగతి ఒకే ఒక్క షాట్‌తో అర్థమవుతోంది. మహేష్ ఓ రౌడీని భుజాన వేసుకుని స్టైలీష్‌గా నడుచుకొస్తున్న స్టిల్… ఈ ట్రైలర్ కే హైలెట్. రాజకీయాల్ని, ప్రజల తలరాతల్ని, చట్ట సభల్లో మన ప్రజా ప్రతినిథుల పనితీరుని మార్చగలిగే ముఖ్యమంత్రి ఎలా ఉంటాడో, ఎలాంటి ముఖ్యమంత్రిని చూడాలని అనుకుంటామో.. సరిగ్గా అలాంటి కథని వండి వార్చినట్టు కనిపిస్తోంది. ఇక నేపథ్య సంగీతం, విజువల్స్, డైలాగుల్లో ఎమోషన్ ఇవన్నీ కొరటాల శివ మార్కుకి తగ్గట్టే ఉన్నాయి. చూస్తుంటే.. శ్రీమంతుడు రికార్డుల్ని చెరిపివేసేలానే కనిపిస్తోంది. మహేష్ అభిమానులే కాదు, చిత్రసీమ కూడా అదే ఆశిస్తోంది.