ప్రత్యేక హోదా సాధన కోసం తెలుగుదేశం ఎంపీలు ఆందోళన సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం నాడు ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం దగ్గర ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం, వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీలను పోలీసులు ఈడ్చుకెళ్లారు. దీంతో ఎంపీ సుజనా చౌదరి భుజానికి గాయమైంది. ఏపీ సమస్యల విషయమై శాంతియుతంగా డిమాండ్ చేస్తుంటే అరెస్టులు చేస్తారా అంటూ సుజనా మండిపడ్డారు. పార్లమెంటులో ఎంతగా పోరాడినా తమ గోడు వినిపించుకోలేదనీ, తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నామని టీడీపీ ఎంపీలు చెప్పారు. ఏపీకి హోదా సాధించే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు.
నిరసన చేస్తున్న టీడీపీ ఎంపీలను పోలీసులు అరెస్టు చేసి, ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ కి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎంపీలకు బాసటగా నిలిచారు. టీడీపీ ఎంపీలను పరామర్శించి సంఘీభావం తెలిపారు. టీడీపీ చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందనీ, తమ రాష్ట్ర హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు వారికి ఉందంటూ కేజ్రీవాల్ సంఘీభావం ప్రకటించారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలనీ, ఏపీకి ఇచ్చిన హామీల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
అయితే, టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటంపై వైకాపా శ్రేణుల స్పందన మరోలా ఉంది. తమలానే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే కేంద్రంపై మరింత ఒత్తిడి పెరిగేదని వైకాపా నేతలు అంటున్నారు. వైకాపా ఎంపీల రాజీనామాల అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయం అవుతోందనీ, టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామాలు చేయడం లేదనే డిమాండ్ పెరుగుతోందనీ, దాన్నుంచి తప్పించుకోవడం కోసమే ఇప్పుడు టీడీపీ ఎంపీలు ప్రధాని ఇంటిని ముట్టడించే కార్యక్రమాల్లాంటివి చేపడుతున్నారంటూ కొన్ని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కానీ, వైకాపా నేతల అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే… రాజీనామాతోనే వారి చివరి అస్త్ర ప్రయోగం జరిగిపోయింది. దాని వల్ల కొత్తగా ఒరిగిందేం లేదు, జరిగిందేం లేదు. రాజీనామాలు చేశారు, తద్వారా హోదా ఎలా సాధిస్తారన్న స్పష్టత ప్రజలకు వారు ఇవ్వలేకపోతున్నారు. ఆ దిశగా ప్రజలు ఆలోచించే లోపుగానే.. వారికి అలవాటైన రాజకీయ దాడి మొదలుపెడుతున్నారని చెప్పుకోవచ్చు