ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి ఏడు ప్రశ్నలు వేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశమై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. ‘తెలుగుదేశం సర్కారును ఏడు ప్రశ్నలు అడిగావు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒక్కటంటే ఒక్క ప్రశ్నైనా అడిగావా’ అని ప్రశ్నించారు. ఒక్క ప్రశ్న ప్రధానిని అడిగే దమ్మూ ధైర్యం నీకుందా అని సవాల్ చేశారు. అడిగితే ఒక్క రోజు తిరగకుండానే చంచల్ గూడ జైలుకి వెళ్తారనే భయం ఆయనలో ఉందన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం ఎంపీలు ధర్నాలు చేయాల్సింది ప్రధాని ఇంటిముందు, ఢిల్లీ పురవీధుల్లో అని చెప్పారు. కానీ, వైకాపా ఎంపీలు ఏపీ భవన్ నాలుగు గోడల మధ్య దీక్షలు చేస్తున్నారన్నారు. రాజీనామాల విషయంలో వైకాపాది ద్వంద్వ వైఖరనీ, లోక్ సభ సభ్యులు రాజీనామాలు చేస్తారుగానీ… రాజ్యసభ సభ్యులు ఎందుకు చెయ్యరో జగన్ చెప్పాలన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి ద్వారా దళారీ పనులు చేయించడానికా అని నిలదీశారు.
గత ఎన్నికల ముందు కేంద్రంతో జగన్ రాజీపడింది పంచవటి ఎవెన్యూస్ గురించి కాదా అని ఆరోపించారు. పంచవటి ఎవెన్యూ కథ ఏంటనేది జగన్ ప్రజలకు చెప్పాలన్నారు. దీనికి సంబంధించిన సూట్ కేసు కంపెనీపై విచారణ ఎందుకు ఆగిపోయిందనీ, జైల్లోంచి వస్తున్నప్పుడే ఇలా జరిగిందనీ, ఎందుకు సీబీఐ ముందుకు వెళ్లలేకపోయిందనీ, ఎందుకు కేంద్రంతో రాజీపడాల్సి వచ్చిందని దేవినేని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన ముందు ఆనాటి కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడింది ఈ కేసుల విషయమై విచారణ ముందుకు సాగకూడదనే అని అన్నారు. ఇవాళ్ల, వివిధ కేసుల్లో ఎ 1, ఎ 2 లుగా ఉన్న జగన్, విజసాయిరెడ్డిలు.. ఇవాళ్ల కేంద్రం అండచూసుకుని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిని బావిలో పడేస్తాననీ, సముద్రంలో దూకమనీ, చొక్కా పట్టుకుంటాననీ చెప్పులతో కొడతాననీ.. ఇలా మాట్లాడటం బాధ్యతగల ప్రతిపక్ష నేత చేసే పనేనా అని నిలదీశారు. కేసుల్లో శిక్షలను తప్పించుకునేందుకు వాయిదాల మీద వాయిదాలు వేయించుకుంటున్నారని అన్నారు.
పార్లమెంటు ఉభయ సభలూ నిరవధికంగా వాయిదా పడితే… ఆ సందర్భంగా జగన్ ప్రెస్ మీట్ పెట్టి, టీడీపీకి ఏడు ప్రశ్నలు వేసిన సంగతి తెలిసిందే. అయితే, దాదాపు గంటపాటు సాగిన ఆ ప్రెస్ మీట్ లో ఒక్కటంటే ఒక్కసారి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన దాఖలాలు లేవు. గడచిన రెండు వారాల్లో పార్లమెంటు ముందు విలేకరులతో మాట్లాడుతూ వచ్చిన విజయసాయి రెడ్డి కూడా ఒక్కటంటే ఒక్క సందర్భలోనూ కేంద్రాన్ని ప్రశ్నించలేదు..! ఎందుకు ప్రశ్నించలేదని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నా.. దాని మీద ఒక్కరంటే ఒక్క వైకాపా నేతల కూడా స్పందించడం లేదు! ఇదంతా ప్రజలకు అర్థమౌతున్న జగన్నాటకమే కదా..!