2003, ఏప్రిల్ 9న వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు పదిహేనేళ్ల కిందటి మాట ఇది. అయితే, ప్రస్తుతం ప్రతిపక్ష నేత జగన్ కూడా పాదయాత్రలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నాటి వైయస్సార్ యాత్రను గుర్తుచేసుకుంటూ ‘సాక్షి’ ఓ కథనం రాసింది. వై.ఎస్. యాత్ర ప్రారంభించే నాటికి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవీ, అప్పటి ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయీ.. ఇలాంటి అంశాలను చర్చించారు. చివరికి ఏం తేల్చారంటే… నాడు రాష్ట్రంలో ఎలాంటి దుర్భర పరిస్థితులు ఎలా ఉన్నాయో, నేడు కూడా అచ్చంగా అలానే ఉందట! కుత్సిత రాజకీయాల వల్ల జనం అలమటిస్తున్నారట. ప్రతీ సగటు మనిషీ ‘మళ్లీ వైయస్ పాలన వస్తే ఎంత బాగుంటుందని’ ఇప్పుడు అనుకుంటున్నారట. ఈ డొంక తిరుగుడు ఎందుకుగ్గానీ… జగన్ అధికారంలోకి వస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారని, ప్రజలను సాక్షి అనుకోమని చెప్తోంది..!
నాటి వై.ఎస్. పాద్రయాత్రకీ, నేటి జగన్ పాద్రయాత్రకీ అసలు పోలికే కుదరదు. మొదటి అంశం… జగన్ నిత్యం చెప్పే నిబద్ధతలోనే చాలా తేడా ఉంది. వైయస్సార్ అత్యంత నిబద్ధతతో పాదయాత్ర చేశారనడంలో సందేహం లేదు. తనకు అనుకూలంగా విశ్రాంతి తీసుకోలేదు. విశ్రాంతి తీసుకోవడానికి ఊరి పొలిమేరల్లో కేరావేన్లు పెట్టించుకోలేదు! జగన్ పాదయాత్ర దీనికి పూర్తి భిన్నంగా సాగుతోంది. ప్రతీ శుక్రవారం ఆయన యాత్రకి బ్రేక్ ఇచ్చి, కోర్టుకు హాజరౌతున్నారు. తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యాత్రకు విరామం తీసుకుంటారు. సెలవులు ప్రకటిస్తున్నారు. విరామ సమయంలో ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్లిపోతుంటారు. తనకు అనువుగా ఉండే వాతావరణంలోనే జగన్ పాదయాత్ర సాగుతోంది. అంతేగానీ… ప్రజల అవసరాలూ, ఆకాంక్షలకు అనుగుణంగా అద్దం పడుతూ నడవడం లేదు.
ఇంకో ముఖ్యమైన తేడా… రాష్ట్రంలోని పరిస్థితులు. 2003 నాటి ప్రజల ఆకాంక్షలు వేరు, ఇప్పటి విభజిత రాష్ట్ర పరిస్థితులు వేరు! ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత అనేది లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత మాత్రమే వ్యక్తమౌతోంది. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందనే ఆక్రోశమే ఉంది. ఈ క్రమంలో టీడీపీ కుత్సిత రాజకీయం చేసిందనో, టీడీపీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తోందనే భావన లేదు. రాష్ట్రం కోసం సీఎం చంద్రబాబు ఏమీ చేయలేదన్న వ్యతిరేకత ఎక్కడా లేదు. వాస్తవం చెప్పాలంటే… ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రయోజనాలను పణంగాపెట్టిమరీ రాజకీయాలు చేస్తున్నదెవరో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
విభజత రాష్ట్రం, భాజపా ఏదో మేలు చేస్తుందని నమ్మి గదాపడిన రాష్ట్రం. ఈ తరుణంలో ప్రజలు ఓదార్పు కోరుకోవడం లేదు. అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. హక్కులను సాధించగలిగే సమర్థ నాయకత్వం కోసం మరోసారి చూస్తున్నారు. ఐదేళ్లకే ప్రభుత్వాన్ని మార్చేసేంత సాహసం చేసే పరిస్థితిలో ప్రజలు లేరు. ప్రతీవారం కోర్టులకు వెళ్లే నాయకుల చేతుల్లో రాష్ట్రాన్ని, భవిష్యత్తునీ పెట్టేందుకు సంసిద్ధంగా లేరు. ఇదీ వాస్తవ పరిస్థితి.