హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్న సీనియర్ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఇప్పటికే టీఆర్ఎస్లో చేరటానికి ఏర్పాట్లు చేసుకుని ఆ పార్టీ పెద్ద తలకాయలతో సంప్రదింపులు జరుపుతున్న డీఎస్, జ్వరంతో బాధపడుతున్న సీఎమ్‌ను పరామర్శించటం అనే నెపంతో ఇవాళ కేసీఆర్‌ను కలుసుకుని పార్టీలో చేరికపై చర్చలు జరిపారు. మీడియాతోమాత్రం, జ్వరంతో బాధపడుతున్నారని తెలిసి పరామర్శించటానికి వచ్చానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేదని, సోనియా గాంధీని పార్టీనేతలు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడుతున్న విషయాన్నిమాత్రం డీఎస్ ప్రస్తావించలేదు.
మరోవైపు డీఎస్‌ను బుజ్జగించటానికి ఇవాళ ఉదయం టి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, వి.హనుమంతరావు డీఎస్ నివాసానికి వెళ్ళినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఆయన అందుబాటులో లేరని సమాధానం వచ్చింది. ఈనెల 6న నిజామాబాద్‌లో జరిగే హరితహారం కార్యక్రమంలో కేసీఆర్ సమక్షంలో డీఎస్ గులాబీ కండువా కప్పుకోనున్నారని అభిజ్ఞవర్గాల సమాచారం.