పవన్ కల్యాణ్ హీరోగా సూపర్ సక్సెస్‌లు చూస్తున్నప్పుడు తన దర్శకత్వంలో “జానీ” అనే సినిమా తీశారు. అప్పట్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా అట్టర్ ఫ్లాపయింది. తన ఇమేజ్ ఎంతో తనే అంచనా వేసుకోకుండా… ఇంగ్లిష్ మూవీస్ టైప్ టేకింగ్ తో… మాస్ ప్రేక్షకులను ఏ మాత్రం పట్టించుకోకుండా… తన టేస్ట్ మేరకు సినిమా తీసి.. ధియేటర్లకు వదిలారు. డిజాస్టర్ అయింది. అప్పట్లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లలో సినిమా ఎలా తీయకూడాదో జానీని పాఠ్యాంశంగా పెట్టారన్న ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు పవన్ రాజకీయాల్లోకి వచ్చారు. మొదట్లో జానీ సినిమాకు వచ్చినంత హైప్‌ను జనసేనకు తీసుకువచ్చారు. నాలుగేళ్లు పాటు పార్టీ నిర్మాణం లాంటి కార్యక్రమాలేమీ చేపట్టకపోయినా… జనసేన ఓ ప్రభావిత పార్టీగానే ఉంది. కానీ ఇప్పుడు జానీ స్థాయికి తీసుకొచ్చేశారు.
రాజకీయాలంటే.. షెడ్యూల్ ప్రకారం చేసుకుంటామంటే కుదరదు. ఇరవై నాలుగ్గంటలూ ప్రజల్లో ఉన్నట్లు ఉండాలి. ప్రతి అడుగూ ప్రజలకు తెలియాలి. కానీ సీక్రెట్ గా వచ్చి వెళతానంటే కష్టమే. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఈ తప్పిదమే చేస్తున్నారు. తన పార్టీకి క్యాడర్ లేదు. ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారు.వాళ్లనే మొబిలైజ్ చేసుకుని రాజకీయంగా తన ఫాలోయింగ్ ను చాటి చెప్పాలి. కానీ పవన్. ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో తనకే తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. తిరుపతికి వెళ్లినప్పుడు.. ఆయనకు తప్ప ఇంకెవరికీ తెలియదు. అక్కడేం చేస్తారో కూడా ఎవరికీ తెలియదు. శ్రీకాళహస్తి, శెట్టిపల్లిల్లో భూసేకరణ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులను కలిశారు. కానీ ఎంత మందికి తెలుసు…? అసలు పవన్ అక్కడి వెళ్తారో లేదో బాధితులకు కూడా క్లారిటీ లేదు.
నిజానికి జనసేన వర్గాలు పదిహేనో తేదీ నుంచి పవన్ కల్యాణ్ బస్సుయాత్ర ఉంటుందని.. మీడియాకు లీకులు ఇచ్చాయి. నిరాటంకంగా యాత్ర సాగుతుందని.. పార్టీని బలోపేతం చేసుకుంటూ ఎక్కడికక్కడ నేతల్ని చేర్చుకుంటూ… జనసేన రేంజ్ ఏమిటో చూపిస్తారని చెప్పాయి. కానీ తీరా చూస్తే పవన్… సైలెంట్ గా విశాఖకు వచ్చి… నిస్సారంగా ప్రకటన చేశారు. పోరాటయాత్ర పేరు చేస్తున్న బస్సుయాత్ర 40 రోజులు ఉంటంటుందన్నారు. కానీ మళ్లీ ఇందులోనే కవాతులే షెడ్యూల్ చేర్చారు. గ్రామాలు నియోజకవర్గాల్లో లక్షల మందితో కవాతులు చేస్తామన్నారు. విభజనహామీలు, ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై పోరాటానికి కవాతులట. ఏదైనా వేడి మీద ఉన్నప్పుడు చేస్తేనే ప్రయోజనం.
ఇప్పుడంతా కర్ణాటక వ్యవహారాలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది కానీ పవన్ కల్యాణ్ తన అభిప్రాయాలను స్వచ్ఛగా వినిపించలేని పరిస్థితుల్లో ఉన్నారు. తనకు ముందే తెలుసున్నట్లుగా.. మూడు నెలల క్రితమే బీజేపీ నేతలు .. చెప్పారని చెప్పుకొచ్చారు. అంటే సమర్థిస్తున్నట్లా..? వ్యతిరేకిస్తున్నట్లా..? ఓ వైపు మీడియాతో సున్నం పెట్టుకుని పబ్లిసిటీ తెచ్చుకోలేని పవన్ పరిస్థితుల్లో ఉన్నారు. కానీ మీడియా మాత్రం పవన్ పై బ్యాన్ వేయలేదు. గతంలోలా ఏం మాట్లాడినా బ్రేకింగ్ న్యూసులేయకపోయినా రాజకీయనేతగా కవరేజీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కాదు. పవన్ ఇలాంటివన్నీ తెలుసుకుని..తన రాజకీయ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లేలా చూసుకుంటే తప్ప. జనసేన అనే పార్టీని సర్వైవ్ చేయలేరు. లేకపోతే.. సినిమాల్లో వపన్‌కు జానీ అయితే. రాజకీయాల్లో జనసేన అవుతుంది. అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్.