కర్ణాటకలో మెజార్టీ లేకపోయినా అతి పెద్ద పార్టీని ఆహ్వానించడాన్ని బీజేపీ సమర్థించుకుంటోంది. కానీ గతంలో చేసిన తప్పులను మాత్రం సమర్థించుకోలేక తంటాలు పడుతోంది. గోవా, బిహార్, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో అతి పెద్ద పార్టీలను ప్రభుత్వ ఏర్పాటుకు అక్కడి గవర్నర్లు ఆహ్వానించలేదు. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో పెద్ద పార్టీలు.. తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్లు ప్రారంభించాయి.
గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీ. నలభై స్థానాలున్న గోవా అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు 21 స్థానాలు అవసరం. కాంగ్రెస్ పార్టీ తరపున 17 మంది గెలిచారు. బీజేపీ తరపున పదమూడు మంది గెలిచారు. కానీ అమిత్ షా రంగంలోకి దిగి.. ఇండిపెండెంట్లు, ఇతర చిన్న పార్టీలను కలుపుకుని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని గవర్నర్ వద్దకు వెళ్లారు. కాంగ్రెస్ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పటికీ… గవర్నర్ కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వలేదు. 13 మంది సభ్యులున్న బీజేపీ ఇతర చిన్న పార్టీలను కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు కర్ణాటక పరిణామాలతో అడ్వాంటేజ్ వచ్చిందనుకున్న గోవా కాంగ్రెస్ లో చలనం వచ్చింది. గోవా కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలతో రాజ్ భవన్ కు పెరేడ్ నిర్వహించాలని తీర్మానించింది. కాంగ్రెస్ కు 17 మంది ఎమ్మెల్యేలుండగా. ఒకరు బీజేపీలో చేరారు. ఇప్పుడు 16 మంది ఉన్నారు.
వా బాటలోనే బిహార్ కూడా నడుస్తోంది. అక్కడ రాష్ట్రీయ జనతాదళ్ అతి పెద్ద పార్టీ. 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఆర్జేడీకి 80 మంది ఎమ్మెల్యేలున్నారు. జేడీయూ 70, బీజేపీ 53, కాంగ్రెస్ కు 27 మంది ఉన్నారు. దానితో ఆర్జేడీ ఇప్పుడు 80 మందితో అతి పెద్ద పార్టీ అయింది. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరుతూ 80 మంది ఎమ్మెల్యేలను రాజ్ భవన్ కు తీసుకెళ్లాలని లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ నిర్ణయించారు. గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు.
మణిపూర్, మేఘాలయలో కాంగ్రెస్ నేతలు కూడా ఇదే ధోరణిలో ఆలోచిస్తున్నారు. మణిపూర్ లో కాంగ్రెస్ సంఖ్యాపరంగా అతి పెద్ద పార్టీ. బీజేపీ దొడ్డి దారిన అధికారానికి వచ్చింది. మేఘాలయాలనూ అందే. కర్ణాటక గవర్నర్ నిర్ణయంతో దేశ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. ఈ డిమాండ్లపై బీజేపీ నేతలు కాంగ్రెస్ పై ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న ప్రభుత్వాలను కూల్చాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కానీ ఇది వాళ్లు నేర్పిన విద్యేనని గుర్తించలేకపోతున్నారు