పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశాఖపట్నంలోని అంబేద్కర్ భవన్లో ఉంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజాపోరాట యాత్ర ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈనెల 20వ తేదీన మొదలుపెట్టి దాదాపు 40రోజులపాటు యాత్ర చేయనున్నారు. అయితే ఆయన విశాఖపట్నంలో అంబేద్కర్ భవన్లో సామాన్యుడిగా గడుపుతున్న తీరు గురించి మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇలా సామాన్యుడిగా గడిపిన సమాచార ఓట్లు పడతాయో అన్న చర్చ కూడా మొదలైంది.
అంబేద్కర్ భవన్లో పవన్ కళ్యాణ్ ఉన్న గదిని మీడియా చూపించింది. విశాఖపట్నంలో అంతా ఉక్కపోత లో ఏసి కూడా లేకుండా కేవలం ఒక ఫ్యాన్ తోనే ఆయన గడుపుతున్నారని మీడియా చూపించింది. ఒక సాదాసీదా పరుపు, కొన్ని పుస్తకాలు, ఒక చాప మాత్రమే ఆ గదిలో ఉన్నాయి. అలాగే టాయిలెట్, బాత్రూం ఇవన్నీ ఒక సినిమా తారకు తగ్గ స్థాయిలో మాత్రమే కాదు కనీసం ఒక మధ్య తరగతి స్థాయిలో కూడా లేవు అన్నట్టు మీడియాలో చూపించారు. అయితే ఇలా సామాన్యుడిగా గడిపినంత మాత్రాన ఓట్లు పడాలని లేదని కొందరు విశ్లేషిస్తున్నారు.
ఇది నిజమే అయినప్పటికీ, ప్రజలు ఓటు వేసే ముందు అనేక విషయాలు విషయాలు పరిగణనలోకి తీసుకుని వేస్తారనేది నిజమే అయినప్పటికీ- గత చరిత్ర చూస్తే ఇలా సామాన్యుడిలా ప్రజల మధ్య గడిపి ప్రజల్ని ఆశ్చర్యపోయేలా చేసిన ఘనత ఎన్టీఆర్ ది. ఆయన రాజకీయ ప్రవేశం జరిగినపుడు, సామాన్యుల మధ్యే ఉంటూ, వాళ్ళ మధ్యే తింటూ, ఆఖరికి బోరు పంపు వద్ద స్నానాలు కూడా చేస్తూ ప్రజలతో మమేకం అయ్యారు. అప్పటివరకు వెండి తెరమీద చూసిన ఆయనను అలా చూడడం ప్రజలను ఆశ్చర్యపోయేలా చేయడమే కాదు ఆయన మీద అభిమానాన్ని పదింతలు పెరిగేలా చేసింది. అలాగే రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కూడా, కారవాన్లు వంటి అధునాతన సౌకర్యాలు లేకుండానే చేశారు. పాదయాత్ర సందర్భంగా ఆయా ఊళ్లలో ఉన్న కిందిస్థాయి నాయకుల ఇంట్లో బస చేశారు.
అయితే ఇటీవల జగన్ చేస్తున్న పాదయాత్ర మాత్రం అధునాతన సౌకర్యాల తో కొనసాగుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలాంటి అధునాతన సౌకర్యాలతో ఉన్న వాహనాల లో యాత్ర చేస్తే, విమర్శలు తప్పవు. బహుశా అలాంటి అభిప్రాయాలకు విమర్శలకు ఆస్కారం ఇవ్వకూడదనే ఈ తరహాలో గడుపుతున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏది ఏమైనా, ఇలాంటి ప్రయత్నాల వల్ల ఓట్లు పడకపోయినా విమర్శలు మాత్రం తప్పుతాయని వారు విశ్లేషిస్తున్నారు