కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ చదరంగంలో చివరి ఎత్తు ఎవరిదో రేపు సాయంత్రం తేలిపోనుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు యడ్యూరప్ప అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం రాజ్యాంగ విరుద్ధమని.. సుప్రీంకోర్టులో కాంగ్రెస్-జేడీఎస్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సిక్రి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది.
కర్ణాటకలో బలపరీక్షకు కనీసం వారం రోజులు సమయం కావాలని బీజేపీ తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కానీ సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కనీసం సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించాలని రోహత్గీ సుప్రీంకోరారు. దీనిని కూడా అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. సాధారణంగా అసెంబ్లీలో బలపరీక్ష ఎలా జరుగుతుందో అలా జరగాలని ఆదేశించింది. శనివారం సాయంత్రం.. బలపరీక్షకు ముహుర్తం నిర్ణయించింది.
యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై స్టే విధించాలని పిటిషన్ వేసిన రోజున కాంగ్రెస్, జేడీఎస్ వాదనలు వినిపించాయి. కానీ సుప్రీంకోర్టు స్టే విధించడానికి నిరాకరించింది. తమకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను సమర్పించడంలో బీజేపీ విఫలమయింది. ఎమ్మెల్యేల జాబితా సమర్పించాల్సిన అవసరం లేదన్న రీతిలో సుప్రీంకోర్టులోవాదనలు వినిపించింది. దీంతో… బలపరీక్షకు సుప్రీంకోర్టు ఆదేశించింది. యడ్యూరప్ప ఇప్పటికే పోలీస్ వ్యవస్థను తన అధీనంలోపెట్టుకుని రాజకీయాలు ప్రారంభించారు. మరో వైపు ఎమ్మెల్యేలకు వంద కోట్లు, మంత్రి పదవి ఆఫర్ చేస్తున్నారని కుమారస్వామి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రేపే బలపరీక్ష జరగనుండటంతో మరిన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం.. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఉన్నారు.