విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాం, అందుకే వరుసగా దేశంలోని రాష్ట్రాలన్నీ తమకు అధికారాలు కట్టబెడుతున్నాయి… రెండ్రోజుల కిందట భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పినమాట. దేశం భాజపాని కోరుకుంటోంది, అందుకే ఒక్కో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తోంది.. ఇది ప్రధాని మోడీ మాట. ఇక, నేతల మైండ్ సెట్ ఎలా ఉందంటే… దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపానే రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావాలి, అందుకే ఒక్కో రాష్ట్రంలోనూ భాజపా శ్రమించి అధికారాన్ని సాధించుకుంటూ దేశాభివృద్ధికి ప్రయత్నిస్తోంది… ఇది ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పినమాట. సందు దొరికితే చాలు, ఇలాంటి ప్రవచనాలు ఇచ్చేవారు చాలామంది ఉన్నారు. కానీ, ఇప్పుడు కర్ణాటకలో భాజపా చేస్తున్నదేంటీ..? రాజకీయ చాణక్యం అంటే మోడీ షా ద్వయం అంటూ జబ్బలు చరుకున్న భాజపాకి రేపు కర్ణాటకలో జరగబోతున్నదేంటీ..? అంటే… ముమ్మూర్తులా గర్వభంగమే.
రేపు సాయంత్రం నాలుగు గంటలకు బలపరీక్ష నిర్వహించాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో భాజపా వర్గాల్లో కలవరం మొదలైంది. ఎందుకంటే, తమ అనుంగ గవర్నర్ ఇచ్చిన అభయం మేరకు 15 రోజులు సమయం ఉంది కదా.. తీరిగ్గా బేరసారాలు జరుపుకోవచ్చని భావించారు! మోడీ షా ద్వయానికి ఇలాంటి రాజకీయాలు కొట్టిన పిండి అనుకున్నారు. కానీ, సుప్రీం తీర్పుతో వారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. భాజపాకి ఏమాత్రమూ అవకాశం ఇవ్వకుండా పటిష్టమైన తీర్పు వచ్చిందనే చెప్పాలి. గవర్నర్ ను కూడా కట్టడి చేస్తూ.. ఆంగ్లో ఇండియన్ వర్గానికి చెందిన ఏ ఒక్కరినీ బలపరీక్ష పూర్తయ్యేవరకూ ఎమ్మెల్యేగా నామినేట్ చేయరాదని సుప్రీం స్పష్టం చేసింది. అంతేకాదు, రహస్య ఓటింగ్ కూడా పనికిరాదనీ, ఎమ్మెల్యేలంతా చేతులు ఎత్తాల్సిందే, వాటిని స్పీకర్ లెక్కించాల్సిందే అని కూడా చాలా స్పష్టంగా చెప్పేసింది. దీంతో భాజపాకి ఉన్న మార్గాలన్నీ మూసుకుపోయాయని చాలామంది అంటున్నారు.
సరే, ఇంత చేసినా కూడా.. ఎక్కడో ఏదో ఒక లొసులుగు పట్టుకుని బలనిరూపణలో ఎడ్యూరప్పను గెలిపించుకున్నా .. భాజపా నైతికంగా ఓడినట్టే..! మోడీ షా వ్యూహం అద్భుతః అని బహిరంగంగా వారే వీరతాడు వేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఒకవేళ, ఎడ్యూరప్పను గెలిపించుకోకపోతే ఆ ఓటమి మరింత పరిపూర్ణమైనట్టు అవుతుంది.
నిజానికి, సుప్రీం కోర్టు తీర్పుతోనే ఆ పార్టీకి గర్వభంగమైనట్టు లెక్క. అధికార దాహంతో రాజ్యాంగ వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజాతీర్పును వెక్కిరించే రాజకీయాలు చేస్తున్న భాజపాకి ఇది చెంపపెట్టు లాంటిది. దీంతో భాజపా వర్గాలకు కూడా ఒక విషయం కచ్చితంగా స్పష్టమౌతోంది..! అదేంటంటే… మోడీ షా ద్వయం వ్యూహాలు అన్ని చోట్లా వర్కౌట్ కావని! మరీ ముఖ్యంగా దక్షిణాదిలో పరిస్థితి మరోలా ఉందనేది తెలుస్తుంది. అంతేకాదు, అవే రాజకీయాలు మున్ముందు చేస్తే పోతే, మొట్టికాయలు వేయడానికి సర్వోన్నత న్యాయం స్థానం ఉందనే విషయం అర్థమౌతుంది.