పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏపీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది నాటికి పూర్తి చేసి తీరాలన్న సంకల్పంతోనే గడచిన కొన్ని నెలల వరకూ పనులు నడిచాయి. కానీ, కేంద్రం ఇచ్చిన హామీలను రాష్ట్రం ప్రశ్నించడం మొదలైన దగ్గర నుంచీ పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం పెడుతున్న కొర్రీలు పెరుగుతున్న సంగతి అందరికీ తెలిసినవే. తాజాగా, గతవారంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పోలవరం బిల్లుల విషయంలో కేంద్రం మెలికలు పెడుతూనే ఉంది. గతంలో కుదుర్చున్న ఎమ్.ఒ.యు.లను కూడా మార్చాలంది. అంతేకాదు, మొత్తంగా ప్రాజెక్టు అంచనాపై మరోసారి సమీక్షించాలన్నట్టుగా అభిప్రాయపడింది. ఇదీ వాస్తవం.!
అయితే, పాదయాత్రలో భాగంగా ప్రతిపక్ష నేత జగన్ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు. అంతా అవినీతిమయం అనే నిరాధార జనరలైజ్డ్ కామెంట్ ని తీసి పక్కనపెడితే.. గత ప్రభుత్వాల హయాంలోనే పోలవరం పనులు చురుగ్గా నడిచాయనీ, చంద్రబాబు వచ్చాక ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని రైతన్నలు తనకు చెప్పారని జగన్ అన్నారు. వైయస్ హయాంలోనే ప్రాజెక్టు పరుగులు తీసిందని రైతులు చెప్పారన్నారు. కాంట్రాక్టర్లకు దోచి పెట్టేందుకు, ఎప్పటికప్పుడు వారి కమీషన్లను చంద్రబాబు పెంచుతున్నారు అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయితే, నిర్వహణ బాధ్యతలు చంద్రబాబుని ఎవరు తీసుకోమన్నారన్నా అని జగన్ తో రైతులు చెప్పారట! అంతేకాదు, చంద్రబాబు చేసిన అవినీతిని చూసి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులివ్వకుండా అడ్డు తగులుతోందన్నారు.
జగన్ సూత్రీకరణ ప్రకారం.. పోలవరం ఆలస్యానికి కూడా చంద్రబాబే కారణమట. సరే, ఒకవేళ అదే కేంద్రం అభిప్రాయమూ కూడా అని కాసేపు అనుకుందాం. మరి, ప్రతిపక్ష పార్టీ నేతగా, రైతులంటే అమిత ప్రేమ ఉందని ప్రచారం చేసుకునే నాయకుడిగా… పోలవరం ఎందుకు ఆలస్యం చేస్తున్నారని కేంద్రాన్ని జగన్ ఏనాడైనా ప్రశ్నించారా..? ప్రధాని కార్యాలయం చుట్టూ చక్కర్లు కొట్టిన సందర్భాల్లో ఒక్కసారైనా విన్నవించినట్టు చెప్పారా..? బిల్లులు ఎందుకు ఆపుతున్నారు, అంచనా వ్యయంపై మరోసారి సమీక్ష ఎందుకంటున్నారు అని ఎప్పుడైనా కేంద్రాన్ని నిలదీశారా..? పక్క రాష్ట్రాల్లో జాతీయ ప్రాజెక్టులు పనులు దశాబ్దాలుగా ఎలా మూలుగుతున్నాయో అందరికీ తెలిసిందే. అంతెందుకు, వైయస్ హయాంలోనే పనులు పరుగులు తీసేస్తే, ఈ ప్రాజెక్టు పనులు ఎందుకు పూర్తి కాలేదు మరి..? అందుకే, జాతీయ ప్రాజెక్టులపై రాష్ట్రాల శ్రద్ధ ఉంటేనే పనులు త్వరగా జరుగుతాయన్న ఉద్దేశంతోనే ఏపీ సర్కారు ఎంటరైంది. ఏపీ పట్ల భాజపా చూపిస్తున్న సవతి తల్లి ప్రేమ వల్లనే పోలవరం ఆలస్యమౌతోందని అందరికీ తెలుసు. ప్రత్యేక హోదా మాదిరిగా ఈ విషయంలో కూడా కేంద్రాన్ని జగన్ ప్రశ్నించరు, అంతే..!