భారతదేశ రాజకీయాలు సంక్లిష్టం. కులమతాలు, రాజకీయాలుతో ఎక్కడిక్కడ విభజన రేఖలు స్పష్టంగా కనిపిస్తూంటాయి. అందుకే జాతీయ పార్టీలు రాను రాను ప్రభావాన్ని కోల్పోతున్నాయి. ఎక్కడికక్కడ కొత్త శక్తులు పుట్టుకొస్తున్నాయి. గత ఎన్నికల్లో పదేళ్ల కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా.. దేశానికి రక్షకుడుగా మోదీని ఫోకస్ చేయడం వల్ల మాత్రమే బీజేపీకి మెజార్టీ సీట్లు వచ్చాయి. కానీ పార్టీగా మాత్రం బీజేపీకి మెజార్టీ రానట్లే. ఈ సారి ఆ పరిస్థితి లేదు. స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా… ప్రత్యర్థులందరూ.. విడివిడిగా ఉండాలని.. కోరుకుంటారు. అందరూ కలిస్తే తనకు సమస్య అవుతుందని ఈజీగా గుర్తిస్తారు. కానీ నరేంద్రమోదీ… తన నియంత ప్రవర్తనతో అందర్నీ సమైక్యం చేస్తున్నారు. దాదాపుగా చేసేశారు కూడా. ఈ విషయాన్ని కర్ణాటకనే నిరూపిస్తోంది.
కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ వచ్చింది. బీజేపీని అధికారానికి దూరం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. బీజేపీ వైపు వెళ్లకుండా జేడీఎస్ పై .. మాయవతి, మమతాబెనర్జీ ఒత్తిడి తెచ్చారు. మిగతా పార్టీలు మోరల్ సపోర్ట్ ఇస్తున్నాియ. అంటే దీనంతటికి కారణం మోదీపై వ్యతిరేకతే. యూపీలో ఎస్బీ, బీఎస్పీ పొత్తును ఎవరూ ఊహించలేరు. కానీ మోదీ రాజకీయాలతో వారిద్దరూ పొత్తు పెట్టుకోక తప్పలేదు. దళిత్-ఓబీసీల కలయికతో బీజేపీకి యూపీలో కనీసం 50 సీట్లు కోత పడనున్నాయని అంచనాలు. ఇక పీడీపీ నేత ఒమర్ అబ్దుల్లా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. మోదీ పతనాన్ని చూసేందుకు ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నారు.
దక్షిణాదిలో నరేంద్రమోదీపై వ్యతిరేకత… తీవ్ర స్థాయిలో ఉంది. కేరళ, తెలుగురాష్ట్రాలు, తమిళనాడు. ఒడిషాల్లో అంతంతమాత్రంగానే బీజేపీ పార్టీ పరిస్థితి ఉంది. నిజానికి ఈ రాష్ట్రాల్లో ఏ పార్టీకి కూడా.. బీజేపీపై ఇప్పటికిప్పుడు యద్ధం ప్రకటించాల్సిన అవసరం లేదు. కానీ తనపై అన్ని పార్టీలు యుద్ధం ప్రకటించేలా చేసుకున్నారు నరేంద్రమోదీ. ఏపీలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీపైనే కుట్ర చేయడంతో.. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బీజేపీని కార్నర్ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలను పరోక్షంగా చేస్తున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే మాత్రమే.. తమ అంతర్గత అవసరాల కోసం… విథేయత ప్రకటిస్తోంది. డీఎంకే, కమల్ సహా ప్రజలంతా… బీజేపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.
దేశం మొత్తం చూస్తే ఇప్పుడు బీజేపీపై కత్తులు దూసేందుకు ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా ఏకమవుతున్నాయి. మోదీ నిరంకుశ రాజకీయ విధానాలతో తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ ఏకమవుతున్నారు. నిజానికి రాజకీయ పార్టీలను.. ఏకం కాకుండా చూసి.. ఎవరికి వారే అన్నట్లుగా ఉంచితేనే… బీజేపీ లాంటి పార్టీలకు లాభం. అందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవన్నీ విఫలమే. నియంతృత్వంతో మోదీ తన పతనాన్ని తానే తెచ్చుకుంటున్నారు.