హైదరాబాద్: ఔట్లుక్ పత్రిక తాజా సంచిక తనపై వెలువరించిన కథనంపై మహిళా ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ స్పందించారు. ఈ కథనం యావత్ మహిళా జాతిని అవమానించటమేనని, మహిళలందరికీ ఆ పత్రిక క్షమాపణ చెప్పాలని అన్నారు. ఒక జాతీయ టీవీ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఔట్లుక్ కథనంపై స్పందించారు. తాను 14 సంవత్సరాలుగా ప్రభుత్వాధికారిగా ప్రజలకు సేవచేస్తున్నానని, ఇంతగా ఎప్పుడూ నొచ్చుకోలేదని అన్నారు. యెల్లో జర్నలిజం ఒక ఐఏఎస్ అధికారినే ఇలా చేయగలిగిందంటే, సామాన్య మహిళల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉండొచ్చని చెప్పారు. దీనికి ముగింపు పలకాలని అన్నారు.
ఔట్‌లుక్‌లో తాను హాజరైనట్లుగా పేర్కొన్న ఫ్యాషన్‌షోకు తన భర్తతో కలిసి వెళ్ళానని స్మిత చెప్పారు. సోషల్ మీడియాలో ఈ విషయంలో తనకు లభించిన మద్దతు తననెంతో కదిలించిందని అన్నారు. ఉన్మాదుల ప్రవర్తనతో స్థైర్యం కోల్పోగూడదని, సముచిత గౌరవానికి మనం పొందాలని మహిళా ఉద్యోగులకు సందేశాన్నిచ్చారు.