మహా అయితే 12 నెలలు.. అంతే, లోక్ సభ ఎన్నికలకు ఉన్న సమయం ఇదే. ఈ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ అంటూ ఆ పార్టీలో సీనియర్లు అభిప్రాయపడుతూ ఉన్నారు.అయితే, గోరఖ్ పూర్, ఫూల్పూర్ మొదలుకొని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, నిన్నటి కైరానా వరకు.. రాజకీయ ముఖ చిత్రం చాలా స్పష్టంగా మారినట్టు కనిపిస్తోంది. మోడీకి ప్రత్యామ్నాయం కోసం వెతుకులాట ప్రారంభమైందనే చెప్పొచ్చు! ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అంశం… ఆ ప్రత్యామ్నాయం రాహుల్ గాంధీ అని ప్రజలు బలంగా అనుకోవడం లేదు! రాహుల్ కూడా అలా కనిపించడం లేదు.
ప్రాంతీయ పార్టీలన్నీ ఒకేఒక్క లక్ష్యంతో పనిచేస్తున్నాయి. మోడీ పాలనకు చరమగీతం పాడాలన్నదే టార్గెట్! ఈ క్రమంలో కాంగ్రెస్ అర్థం చేసుకోవాల్సిన మరో పాయింట్… రాహుల్ నాయకత్వంలో మాత్రమే నడుద్దామని ప్రాంతీయ పార్టీలు బలంగా అనుకోవడం లేదు. అలాగని కాంగ్రెస్ కు దూరంగా ఉండాలనే పట్టుదలతో కూడా ప్రాంతీయ శక్తులు లేవు. కాబట్టి, ప్రస్తుతం రాహుల్ గాంధీ పోషించాల్సిన పాత్ర చాలా స్పష్టంగా ఉంది. ప్రతిపక్షాలను ఏకం చేసే వేదికగా కాంగ్రెస్ ఉంది అనే ధీమా కలిగించే ప్రయత్నం ఇప్పుడు మొదలుపెట్టాలి. ప్రస్తుతానికి ప్రధానమంత్రి కలలను కూడా పక్కన పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.
2019 ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ అనే విధంగా ఉండవు. మహా కూటమి వెర్సెస్ భాజపా అన్నట్టుగా పోరు ఉండే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్ని మోడీ పాయింటాఫ్ వ్యూ నుంచి రాష్ట్రాలు చూసే అవకాశమూ తక్కువే. మోడీ హవా జమానా అయిపోయిందనే చెప్పాలి. తమ రాష్ట్రంలో భాజపాకి అవకాశం ఇవ్వకూడదన్న పట్టుదలతో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. భాజపా ప్రయత్నించినా సరే, ఎన్నికల నాటికి ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సంఖ్య పెంచుకునే పరిస్థితి కూడా తగ్గింది. ఉన్నవాళ్లు కూడా దూరమౌతున్న పరిస్థితి. తాజాగా నితీష్ కుమార్ వైఖరి ఎలా మారిందో చూస్తున్నాం. ఈ క్రమంలో కాంగ్రెస్ తనకు తానుగా పెద్దన్న పాత్రను తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపై రాహుల్ గాంధీ ప్రాంతీయ పార్టీల ఐక్యతకు కృషి చేయడం ప్రారంభించాలి. ప్రాంతీయ శక్తుల్ని ముందు వరుసలో మోహరించి, వారి వెనక కాంగ్రెస్ నిలవాల్సిన అవసరముంది. మరి, రాహుల్ ప్రయత్నం ఎలా ఉంటుందో చూడాలి.