వంచనపై గర్జన పేరుతో మరో సభ నిర్వహించేందుకు ప్రతిపక్ష వైకాపా శ్రేణులు సిద్ధమౌతున్నాయి. జూన్ 2న నెల్లూరులో సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వంచనపై గర్జన సభకి రాజీనామా చేసిన ఐదుగురు ఎంపీలతోపాటు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కో ఆర్డినేటర్లు హాజరవుతారు. సరిగ్గా ఇలాంటి సభే ఏప్రిల్ 30న విశాఖలో జరిగింది. ఆ సభకి ఓ మాదిరిగా స్పందన వచ్చింది. విశాఖ అయిన వెంటనే మరో సభ పెడుతున్నామని అన్నారుగానీ… రెండో సభ నిర్వహణకు ఇన్నాళ్లు సమయం తీసుకున్నారు.
ఇక, ఈ వంచనపై గర్జన సభలో వైకాపా నేతలు ఏం మాట్లాడతారు..? అంటే, ప్రత్యేక హోదా సాధనలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. సాక్షి కథనం ప్రకారం… అనుభవజ్ఞుడని ప్రజలను నమ్మించి, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు, నాలుగేళ్లపాటు భాజపాతో మిత్రపక్షంగా ఉండి కూడా హోదా సాధించలేకపోయారన్న వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైకాపా నేతలు నిర్ణయించారు. చంద్రబాబు ఏపీకి చేసిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేందుకు వైకాపా నేతలు సిద్ధమౌతున్నారట! హోదా కోసం టీడీపీ చేస్తున్న ధర్మ పోరాట దీక్షల్లో డొల్లతనాన్ని ఎండగడతారట.
నిజానికి, గర్జన దీక్షలు అంటూ వైకాపా నేతలు కొత్తగా వినిపిస్తున్నదేమీ లేదు. పాదయాత్రలో ప్రతీరోజూ జగన్ చేస్తున్న విమర్శలే.. నాయకులంతా మరో చోటకి చేరి చేస్తున్నారు. ఇంకోటి, ప్రత్యేక హోదాపై వైకాపా పోరాటం అంటోందేగానీ.. దానిపై కొంత గందరగోళం కొనసాగిస్తూనే ఉంది. మొదటిది.. హోదా ఇవ్వాల్సిన కేంద్రంపై వైకాపా సమరం సాగడం లేదు. రెండోది.. ప్రత్యేక హోదా ఎలా సాధిస్తారు అనేదానిపై కూడా వైకాపా వాదనలో స్పష్టత లేదు. ఎందుకంటే, ఎన్నికల తరువాత భాజపాకి వైకాపా మద్దతు ఇస్తుందా..? లేదంటే, కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుందా..? ఇంకోటి… 2019 నాటికి ఏర్పాటు కాబోతున్న ప్రాంతీయ పార్టీల జాతీయ కూటమిలో వైకాపా ఉంటుందనే స్పష్టతా ఇంకా లేదు. ఒకవేళ ఆ కూటమికి మద్దతు ఇస్తున్నట్టు వైకాపా వైఖరి స్పష్టమైతే… అది భాజపాకి వ్యతిరేకమౌతుంది కదా! అందుకే దీనిపై జగన్ మౌనంగా ఉంటున్నారా అనే అనుమానమూ ఉంది. సో… ఈ పరిస్థితుల మధ్య ప్రత్యేక హోదాను వైకాపా ఎలా సాధిస్తుందనే స్పష్టత జగన్ ఇంకా ఇవ్వలేకపోతున్నారు. ఆ కన్ఫ్యూజన్ తోనే జగన్ పాదయాత్ర, కొత్తగా ఈ గర్జన సభలూ చేసుకుంటూ పోతున్నారు!