ఐపీఎస్ పదవి నుంచి వీఆర్ఎస్ తీసుకున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణకు స్పష్టమైన రాజకీయ ఆలోచనలు ఉన్నాయి. జిల్లాల పర్యటనలో ఉన్న ఆయన .. సందర్భం వచ్చినప్పడల్లా…. ఒక్కొక్కదాన్ని బయటకు చెబుతున్నారు. లక్ష్మినారాయణ ఇప్పుడు ఎక్కడకు వెళ్లినా రాజకీయమే హాట్ టాపిక్. రైతులతో సమావేశాలు జరిపినా… చేనేత కళాకారుల కష్టాలు తెలుసుకున్నా… మీడియా పట్టించుకోవడం లేదు. ఆయనను రాజకీయాలపైనే కదిపే ప్రయత్నం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు… లక్ష్మినారాయణ…రాజకీయాలపై తనకు ఉన్న కొన్ని అభిప్రాయాలను నిస్సంకోచంగా వెల్లడించారు. అందులో కీలకమైన పాయింట్.. జీరో బడ్జెట్ పాలిటిక్స్.
ప్రస్తుతం రాజకీయాలు అంటే అత్యంత ఖరీదైనవి. సభలు, సమావేశాల నిర్వహణకే కోట్లు ఖర్చు పెడుతూంటారు. ఇక ఓట్ల కోసం పంచే నోట్ల లెక్కలు ఎవరూ తీయలేరు. ఈ విషయంలో సమూలమైన మార్పును లక్ష్మినారాయణ కోరుకుంటున్నారు. ఇందు కోసం ముందుగా రాజకీయాలపై ప్రజల ఆలోచనా విధానం మారాల్సి ఉందన్నారు. దీంతో పాటు.. అధికార పార్టీ ప్రచారం చేయకూడదనేది ఆయన కాన్సెప్ట్. అధికారంలో ఐదేళ్లు ఉన్నారు కాబట్టి.. ఆ పార్టీ పని తీరే ప్రచారంగా ఉంటుందని… పాలనే గెలిపిస్తుంది కదా.. ప్రచారం ఎందుకన్నది ఆయన అభిప్రాయం. రాజకీయాలు ఖరీదైపోవడం వల్లే అవినీతి జరుగుతోందన్న అభిప్రాయం లక్ష్మినారాయణ పరోక్షంగా వ్యక్తం చేశారు. అందుకే… రాజకీయాలు చేయాలంటే.. ఖర్చులేమీ ఉండకూడదన్న భావన వ్యక్తం చేశారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ రావాల్సి ఉందన్నారు.
రాజకీయ రంగ ప్రవేశంపై లక్ష్మినారాయణ ఇంత వరకూ బహిరంగంగా ఎక్కడా చెప్పలేదు. వస్తానని కానీ.. రానని కానీ చెప్పకపోయినా… రాజకీయాలపై తనకు ఉన్న ఆసక్తిని మాత్రం తరచూ వ్యక్తం చేస్తూంటారు. ప్రజల్లోకి వచ్చిన తొలి సమావేశంలోనే.. వ్యవసాయమంత్రిని కావాలని ఉందని వ్యక్తం చేశారు. ఆ తర్వాత రాజకీయాలపై… పరోక్షంగానైనా తన ఆసక్తిని బయటకు చెబుతూనే ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే లక్ష్మినారాయణ రాజకీయాల్లోకి రావడం ఖాయమేనంటున్నారు.. రాజకీయాల్లో పండిపోయిన వాళ్లు.