మహానాడు జరుగుతున్నప్పుడే.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అత్యంత దారుణంగా తిట్ల వర్షం కురిపించారు తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు ..అప్పుడే ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా యాత్ర చేస్తానని శపథం చేశారు. టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయాలని మోత్కుపల్లి ఓ సారి వ్యాఖ్యానించారు. అప్పట్నుంచి ఆయనను పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదు. చివరికి మహానాడుకు కూడా పిలవకపోవడంతో … ఆయన కినుక వహించారు. ఎన్టీఆర్ జయంతి రోజున… ఒక్కసారిగా బ్లాస్టయ్యారు. ఏడ్చారు. చంద్రబాబుపై తిట్లు లంకించుకున్నారు. ఆ కారణంగా ఆయనను టీ టీడీపీ అధ్యక్షుడు రమణ పార్టీ నుంచి బహిష్కరించారు. ఇది జరిగి వారం కాక ముందే మోత్కుపల్లితో మద్రగడ పద్మనాభం సమావేశమయ్యారు.
కాపు రిజర్వేష్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు…ఇప్పుడు చంద్రబాబు ఒక్కరినే శతృవుగా పరిగణిస్తున్నారు. చంద్రబాబు టార్గెట్గా ఆయన రాజకీయాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎప్పటికప్పుడు తన కోపం అంతా కలిపి లేఖలు రాస్తున్నారు. చివరికి తాను చేసిన కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని కూడా దాదాపుగా పక్కన పెట్టేశారు. రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేలా బీజేపీపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు అసలు చేయకుండా.. ఆ పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. కన్నా లక్ష్మినారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షునిగా ఎంపికయిన రెండు గంటల్లోనే గుంటూరు వెళ్లి మంతనాలు జరిపారు. ఇప్పుడు మోత్కుపల్లి నర్సింహులు.. చంద్రబాబుపై రివర్స్ అవగానే వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు.
మోత్కుపల్లి నర్సింహులు ఏపీలో చేపడతానని ప్రకటించిన యాత్రకు తాను మద్దతు ఇస్తానని ముద్రగడ పద్మనాభం చెప్పినట్లు తెలుస్తోంది. తమ సామాజికవర్గం అంతా.. మద్దతుగా ఉండేలా ఏర్పాట్లు చేస్తానని.. మరింత ఉద్ధృతంగా ఏపీలో .. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని ఆయన మోత్కుపల్లిని కోరినట్లు తెలుస్తోంది. దీనికి మోత్కుపల్లి కూడా..సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. మొత్తానికి శత్రువుకు శత్రువు మిత్రుడైనట్లు.. ముద్రగడ పద్మనాభం.. చంద్రబాబును వ్యతిరేకించి ఘాటుగా విమర్శలు చేసే మోత్కుపల్లి లాంటి నేతంలదర్నీ… రాష్ట్రాలకు అతీతంగా ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. రాజకీయ కుట్రలపై ఇప్పుడు ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటోందని.. ఎవరేమిటో అందరికీ తెలుసని టీడీపీ నేతలు చెబుతున్నారు. మోత్కుపల్లి యాత్ర చేసినా.. ముద్రగడ ఏర్పాట్లు చేసినా.. అంతా బీజేపీ ఫండింగే తప్ప… ఎవరూ .. ఏ లాభం లేకుండా.. చంద్రబాబు మీద పోరాటానికి రారని గుర్తు చేస్తున్నారు. బీజేపీ ఏదో ఇస్తానని ఆశ పెట్టడం వల్ల ఈ నేతలు… ఏపీలోకి వస్తున్నారని.. వారికి ప్రజలు బుద్ది చెబుతారని అంటున్నారు.