జాతీయ స్థాయిలో రాజకీయాలు మారుతున్న తరుణమిది! భాజపాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నీ సంఘటితం అవుతున్నాయి. వచ్చే ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ మరోసారి కీలక శక్తిగా మారుతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాట ఏంటంటే… 2019 ఎన్నికల తరువాత, పరిస్థితులన్నీ అనుకూలిస్తే టీడీపీకి మరోసారి చక్రం తిప్పే అవకాశం వస్తుందనీ, ప్రయత్నిస్తే చంద్రబాబు ప్రధానమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నారు. దీంతో టీడీపీ శ్రేణులు కూడా ఇదే అంశాన్ని అందుకున్నాయి. తాజాగా జరిగిన మహానాడులో కూడా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇదే అంశాన్ని ప్రస్థావించారు. అయితే, ఈ ప్రధాని అంశాన్ని చంద్రబాబు పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదన్నది అర్థమౌతూనే ఉంది. కానీ, జాతీయ రాజకీయాలపై మాత్రం వ్యూహత్మకంగానే ఉన్నారనే చెప్పాలి.
శుక్రవారం అమరావతిలో మాట్లాడుతూ జాతీయ రాజకీయాలపై చంద్రబాబు ఒక స్పష్టత ఇచ్చారు. దేశ రాజకీయాల్లో ఎప్పుడు ఏం చెయ్యాలో తనకు అవగాహన ఉందన్నారు చంద్రబాబు. అందరి మాదిరిగా తానూ కుప్పిగంతులు వేస్తే అర్థమేముందన్నారు. తానేం చేసినా ఒక పద్ధతిగా ఉంటుందన్నారు. దేశంలోని రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేస్తున్న వ్యక్తిగా, అనేక సందర్భాల్లో భాగస్వామ్యమైన వ్యక్తినని గుర్తు పెట్టుకోవాలన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో పలు సందర్భాల్లో ఉన్నామన్నారు. జాతీయ రాజకీయాల్లో ఉండే సాధ్యాసాధ్యాలు కూడా తనకు తెలుసునన్నారు. అందుకే, నేషనల్ ఫ్రెంట్ పెడతా, యునైటెడ్ ఫ్రెంట్ పెడతా, నేనే ప్రధాని అవుతా అంటే ఏమౌతుందీ.. జరిగేదేంటీ అని వ్యాఖ్యానించారు. ఒక పద్ధతి ప్రకారం చెయ్యాలి తప్ప, తొందరపడి ఏదీ చెయ్యనన్నారు. సో… జాతీయ రాజకీయాలపై వ్యూహాత్మకంగానే ఉన్నారన్నది మరోసారి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా వైకాపా ఎంపీల రాజీనామాల అంశంపై కూడా మాట్లాడారు. ఆ పార్టీ ఎంపీలు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసినప్పుడు ఎందుకు వెంటనే ఆమోదించలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. వైకాపా, భాజపాల మధ్య లోపయికారీ అవగాహన ఉందని చెప్పడానికి రాజీనామాల ఆమోదించకపోవడమే ఉదాహరణ అని చంద్రబాబు విమర్శించారు.