ఉద్యోగి కష్టం వస్తే స్ట్రైక్ చేస్తాడు…! కార్మికుడికి కష్టం వస్తే సమ్మె చేస్తాడు…! వ్యాపారికి నష్టం వస్తే బంద్ చేస్తాడు.. ! మరి రైతుకు ష్టం వస్తే ఏం చేస్తాడు..? ఈ తరహా డైలాగ్, సన్నివేశాలు చాలా సినిమాల్లో వచ్చాయి. రైతు బంద్ చేయడమేమిటని.. చాలా మంది అనుకున్నారు కూడా. నిజంగా రైతులు బంద్ చేస్తే… ఎలా ఉంటుందో ఊహించుకుంటే ఇప్పుడు వారు చూపిస్తున్నారు. దేశం మొత్తం మీద రైతులు బంద్ ప్రారంభించారు. 130 రైతు సంఘాల సమాఖ్య రాష్ట్రీయ కిసాన్ మహా సంఘ్ ఈ నిరసనకు నేతృత్వం వహిస్తోంది. మద్దతు ధర రావడం లేదని ఆరోపిస్తూ.. ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులు కూరగాయలు, పాలను రోడ్డుపై పారబోశారు. పంజాబ్, హరియాణా, రాజస్థాన్, జమ్మూ-కశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని రైతులు ఉద్యమించారు.
దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయాలన్నది రైతుల ప్రధాన డిమాండ్. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తూ పాల సేకరణ ధరను 27 రూపాయలుగా నిర్ణయించాలనేది మరో డిమాండ్. మూడు నెలల క్రితం ఇలాంటి డిమాండ్లతోనే మహారాష్ట్ర రైతులు చలో ముంబై ఉద్యమం నిర్వహించడంతో మహారాష్ట్ర సర్కారు దిగివచ్చింది. వారి డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తామని ప్రకటించింది. ఇప్పుడీ రైతుల బంద్‌కూ మహారాష్ట్ర రైతులు కూడా చేయి కలిపారు. ఆయా రాష్ట్రాల్లో పది రోజుల పాటు పట్టణాలు, నగరాలకు కూరగాయలు సరఫరా చేయబోమని రైతులు తేల్చేశారు. రైతు ఉద్యమాలకు గావ్ బంద్ అని పేరు పెట్టారు. పట్టణాలకు వచ్చి రాస్తా రోకోలు చేస్తూ ప్రజా జీవనానికి అడ్డుపడటం తమ ఉద్దేశం కాదని రైతులు చెబుతున్నారు.
ఈ పది రోజులు పట్టణాలకు కూరలు, పాలు తీసుకురాబోమని అంటున్నారు. వ్యవసాయోత్పత్తులు కావాల్సిన వాళ్లు గ్రామాలకే వచ్చి కొనుక్కోవాలని, అప్పుడే తమ బాధలు పట్టణవాసులకు తెలుస్తాయని రైతులు అంటున్నారు. మధ్యప్రదేశ్ మందసౌర్‌లో గతేడాది జూన్ ఆరున నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై పోలీసు కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ఏడుగురు చినిపోయారు. ఈ ఘటనకు నిరసనగా మధ్యప్రదేశ్ లో రైతులు జూన్ పదిన బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ బంద్‌పై ఇప్పటికే రాజకీయాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కావాలనే చేయిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. రైతుల ఆవేదనను రాజకీయం చేస్తున్నారని.. కాంగ్రెస్ విమర్శిస్తోంది.
పట్టణాలు, నగరాలకు రైతు ఉత్పత్తుల నిలిపివేత వల్ల రాబోయే పది రోజుల్లో వీటి కొరత తీవ్రంగా ఉండబోతోంది. డిమాండ్‌కు తగ్గ సప్లయ్ లేకపోవడం వల్ల ధరలు చుక్కలనంటే అవకాశం ఉంటుంది. ఉత్తర భారత నగరాలైన న్యూఢిల్లీపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అలాగే హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలపైన కూడా గణనీయంగా పడవచ్చు. ఉల్లి, టమోటాల కోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలపైనే ఢిల్లీ మార్కెట్ ఎక్కువగా ఆధారపడుతోంది.