కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ మధ్య ఎట్టకేలకు పదవులు, శాఖల పంపకంపై ఒప్పందం కుదిరింది కుమారస్వామి, పరమేశ్వరల ప్రమాణ స్వీకారానికి ముందే కాంగ్రెస్ 22, జేడీఎస్ పన్నెండు మంత్రి పదవులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. కానీ తర్వాత ఏయే శాఖలు ఎవరెవరు తీసుకోవాలన్నదానిపై పీటముడి పడింది.చర్చోపచర్చలు జరిపిన తర్వాత.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో నిరంతరం సంప్రదింపులు జరిపిన తర్వాత.. ఎట్టకేలకు రెండు పార్టీలు ఓ అంగీకారానికి వచ్చాయి. రెండు పార్టీల మధ్య ఇరుక్కుపోయిన ఆర్థిక శాఖను జేడీఎస్ పట్టుబట్టి మరీ తన వద్దే ఉంచుకుంది. విద్య, ప్రజా పనుల శాఖ, రవాణా, పర్యాటకం, ఇంటెలిజెన్స్ లాంటి విభాగాలు కూడా జేడీఎస్ ఖాతాలోకి వెళ్లిపోతాయి. ఆ పార్టీకి మొత్తం 12 మంది మంత్రులుంటారు. హోం శాఖతో పాటు బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖ, రెవెన్యూ, నీటి పారుదల, వైద్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, చక్కెర పరిశ్రమ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి 22 మంది మంత్రులుంటారు.
సంకీర్ణ పాలనలో ఒడిదుడుకులు లేకుండా చూసేందుకు ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ పర్యవేక్షక కమిటీగా కూడా వ్యవహరిస్తుంది.కమిటీకి సిద్ధరామయ్య అధ్యక్షత వహిస్తారు. జేడీఎస్ కు చెందిన డేనిష్ అలీ కన్వీనర్‌గా ఉంటారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఈ నెల ఆరో తేదీన ఉంటుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముందే నిర్వహించాలనుకున్నా… గవర్నర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తూండటంతో ఆరో తేదీన నిర్వహిస్తున్నారు.
ఈ చర్చల్లో అతి పెద్ద ముందడుగు.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ రెండు పార్టీలు కలసి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం. ఇప్పటి వరకూ అడపాదడపా.. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసే విషయంపై దళపతి దేవేగౌడ.. కాస్త బ్లాక్ మెయిలింగ్ తో కూడిన ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మంత్రివర్గ పదవుల పంపకంతో.. దాన్నీ సెటిల్ చేసేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయా పార్టీల్లో అంతర్గత రాజకీయాలు ఊపందుకోనున్నాయి. రెండు పార్టీలు.. ఏయే శాఖలు తీసుకోవాలో నిర్ణయించుకున్నారు. ఇక ఆయా పార్టీలు ఎవరెవరికి ఇవ్వాలో నిర్ణయించుకోవాల్సి ఉంది. జేడీఎస్ లో కన్నా.. కాంగ్రెస్ లోనే ఇది పెద్ద పంచాయతీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.ఈ ఎపిసోడ్ ఆరో తేదీ దాకా ఉంటుంది.