వచ్చే ఎన్నికల్లో వైకాపాతో భాజపా పొత్తు ఉంటుందనే ఒక స్థాయి నమ్మకం దాదాపు అందరిలోనూ ఉంది. భాజపా విషయంలో వైకాపా అనుసరిస్తున్న సన్నాయి నొక్కుల ధోరణే అందుకు సాక్ష్యం. 2014 ఎన్నికల్లో ‘స్కామాంధ్రా కావాలా, సీమాంధ్రా కావాలనే అనేది మీ చేతుల్లోనే ఉందంటూ’ జగన్ ను ఉద్దేశించి విమర్శలు చేసిన మోడీ.. ఆ తరువాత, నెమ్మదిగా బాణీ మార్చేశారు. అవసరమైతే వైకాపాను దగ్గర చేర్చుకునేందుకు సిద్ధం అన్నట్టుగా వారే తలుపు తెరిచే ఉంచారు. దీంతో జగన్ మరింత ఉత్సాహం ప్రదర్శించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి అడక్కుండానే మద్దతు ఇచ్చారు. ఓపక్క కేంద్రంపై అవిశ్వాసం అంటూనే మరోపక్క ప్రధాని కార్యాలయం చుట్టూ ఎంపీ విజయసాయి చక్కర్లు కొట్టారు. సో.. ఎన్నికలు ముందు కాకపోయినా, తరువాతైనా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందనే అంచనాలే ఉన్నాయి.
కానీ, ప్రస్తుతం భాజపా ఆలోచన విధానం అలా లేదని తెలుస్తోంది..! వైకాపాతో పొత్తు విషయమై భాజపాలో ఇటీవలే సమాలోచనలు జరిగినట్టు పార్టీ అంతర్గత వర్గాల ద్వారా తెలిసింది.. అంతిమంగా, ఏపీలో వైకాపాతో పొత్తు వద్దని భాజపా అధినాయకత్వం ఒక స్పష్టమైన అభిప్రాయానికి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. వైకాపాకి మొదట్నుంచీ స్నేహ హస్తం చాచుతూ వచ్చినా, ఇకపై అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వైకాపాని భాజపా వద్దనుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది.. ప్రత్యేక హోదా ఎవరిస్తే వారితో కలిసేందుకు సిద్ధమని జగన్ ప్రకటించడం! ఎందుకంటే, భాజపా ఎలాగూ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు లేవు కదా. హోదా అడుగుతున్న జగన్ ను దగ్గర చేర్చుకుంటే భవిష్యత్తు ఏంటనే అంశం చర్చనీయం అవుతుంది కదా! అయితే, ఈ కారణాన్ని ఓ ప్రముఖ భాజపా నేత కొట్టి పారేశారు. ‘ప్రత్యేక హోదా జగన్ అడుగుతున్నారని పొత్తు వద్దనుకోవడం లేదనీ, పార్టీ భవిష్యత్తును విశ్లేషణ చేసుకుని అవసరాలను చూసుకుంటుంది కదా’ అంటూ అభిప్రాయపడ్డారు.
ఇక, రెండో కారణం… జగన్ పై ఉన్న అవినీతి ఆరోపణలు. ఇప్పటికీ ప్రతీ శుక్రవారం జగన్ విచారణకు హాజరౌతున్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలు అలానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైకాపాతో పొత్తుకి వెళ్తే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీని భాజపా దగ్గర చేర్చుకుందనే విమర్శలు తప్పవు. కాబట్టి, జగన్ తో దోస్తీ వద్దనుకోవడం వెనక ఈ కారణాలే ప్రధానంగా ప్రభావితం చేసి ఉంటాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి, జగన్ విషయంలో భాజపా దాదాపు ఒక స్పష్టతకు వచ్చినట్టే అని విశ్వసనీయ వర్గాల సమాచారం..!