విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అదినేత చంద్రబాబుతో శుక్రవారం సమావేశమయ్యారు. మీడియాకు కూడా తెలియకుండా.. ఆయన సైలెంట్‌గా వచ్చి చంద్రబాబుతో చర్చలు జరిపి వెళ్లిపోయారు. దీంతో రాజకీయవర్గాల్లో మరోసారి ఆసక్తికర చర్చలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న సమయంలో లగడపాటి రాజగోపాల్ మళ్లీ… ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఈ ప్రచారాన్ని మాత్రం లగడపాటి ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు. ఇటీవలి కాలంలో చంద్రబాబుతో కనీసం ఆరు నెలలకు ఓ సారి అయినా సమావేశం అవుతున్నారు. చంద్రబాబుతో తన సమావేశాల్లో ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని.. సమావేశమైనప్పుడల్లా.. లగడపాటి చెబుతూంటారు.
రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో లగడపాటి చేసిన పోరాటం.. ఆంధ్రుల్లో ఆయనకు ప్రత్యేకమైన ఇమేజ్ తీసుకొచ్చింది. రాష్ట్ర విభజన అంటూ జరిగితే తాను రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే ఆయన తన ఆసక్తి మేరకు… ఆర్జీ ఫ్లాష్ టీం పేరుతో.. సర్వేలను చేయిస్తూంటారు. లగడపాటి ప్రకటించే సర్వేలు.. ఖచ్చితత్వంతో ఉంటాయి. అందుకే నెటిజన్లు ఆయనకు ఆంధ్రా ఆక్టోపస్ అనే పేరును ఆయనకు బిరుదుగా తగిలించేశారు. నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో లగడపాటి చేసిన సర్వేలు… నిజమయ్యాయి. ఆ తర్వతా కూడా.. చంద్రబాబు కోరిక మేరకు… ఏపీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తన సంస్థ ద్వారా సర్వేలు చేయిస్తున్నారని.. ఆ నివేదికలను ఇస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు కూడా… బీజేపీతో విడిపోయిన తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితిపై లగడపాటి తన సంస్థ ద్వారా చేయించిన సర్వే నివేదికను ముఖ్యమంత్రి ఇవ్వడానికి వచ్చారని కొంత మంది చెబుతున్నారు. కానీ లగడపాటి రాజగోపాల్‌కు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు తెలుగుదేశం పార్టీని ఎంచుకున్నారని.. ఆ దిశగానే… చంద్రబాబుతో చర్చలు జరుపుతున్నారని కూడా కొంత మంది అంచనా వేస్తున్నారు. విభజన నాటి పరిస్థితులు మళ్లీ ఏపీలో ఉండటంతో.. ఢిల్లీపై పోరాటానికి లగడపాటి లాంటి వాళ్లు అవసరమని.. చంద్రబాబు కూడా భావిస్తున్నట్లు వారు చెబుతున్నారు. నిజం ఏమిటో కానీ… లగడపాటి మాత్రం సీక్రెట్‌గా చంద్రబాబుతో చర్చలు జరిపి వెళ్లిపోయారు.