వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాల ఆమోదానికి లోక్‌సభ స్పీకర్ ముహుర్తం ఖరారు చేశారు. ఈ నెల ఐదో తేదీ సాయంత్రం లేదా… ఆరో తేదీ ఉదయం సుమిత్రామహాజన్ తో సమావేశానికి రావాలని రావాలని … ఎంపీలకు స్పీకర్ ఆఫీసు లేఖలు పంపింది. గత నెల ఇరవై తొమ్మిదో తేదీన వైసీపీ ఎంపీలందరూ సుమిత్రా మహాజన్‌ను కలిశారు. తమ రాజీనామాలు ఆమోదించాలని కోరారు. అయితే ప్రత్యేకహోదాపై భావోద్వేగ పరిస్థితుల కారణంగా ఆ ఎంపీలు రాజీనామా చేసినట్లు భావిస్తున్నానని చెప్పిన స్పీకర్.. మరోసారి ఆలోచించుకోమని చెప్పి పంపించారు. ఈ సారి కూడా.. తమ రాజీనామాలు ఆమోదించాల్సిందేనని ఎంపీలు పట్టుబడితే ఆమోదించక తప్పదని ఆమె 29వ తేదీనే ప్రకటించారు. దాంతో ఈ సారి స్పీకర్‌తో ఎంపీల భేటీ సమయంలోనే… రాజీనామాలను ఆమోదించడం ఖాయంగా కనిపిస్తోంది.
నిజానికి వైసీపీ ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాల చివరి రోజే రాజీనామా లేఖలు స్పీకర్ ఫార్మాట్లో సుమిత్రా మహాజన్‌కు ఇచ్చారు. వ్యక్తిగతంగా కలిసి… లేఖలు ఇచ్చి రాజీనామాలను ఆమోదించాలని కోరారు. కానీ ఆమె పెండింగ్‌లో పెట్టారు. ఆగస్టులో మళ్లీ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే వరకూ… ఆమె నిర్ణయం తీసుకోరని అందరూ భావించారు. అయితే ఈ లోపే కర్ణాటకకు చెందిన ఎంపీలు యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామాలు చేయడంతో అప్పటికప్పుడు ఆమోదించేశారు. దీంతో.. బీజేపీ, వైసీపీ కలిసే రాజీనామా నాటకాలు ఆడుతున్నాయన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. ఇవి అంతకంతకూ పెరిగిపోతూండటంతో చెక్ పెట్టేందుకు సుమిత్రా మహాజన్.. హఠాత్తుగా ఎంపీలను పిలిపించి మాట్లాడారు. 29వ తేదీన వారి రాజీనామాలను ఆమోదిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆమె నిర్ణయాన్ని వాయిదా వేశారు.
ఈ సారి మాత్రం వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించడం ఖాయమే. 29వ తేదీన రాజీనామాలను ఆమోదిస్తే.. ఉపఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుందని.. కొంత మంది న్యాయనిపుణులు సూచించడంతోనే నిర్ణయం వాయిదా వేసుకున్నరని భావిస్తున్నారు. ఉపఎన్నికలు రాకుండా ఉండాలంటే.. జూన్ ఐదు లేదా ఆ తర్వాత రాజీనామాలు ఆమోదిస్తే మంచిదన్న సూచనలతో.. వైసీపీ, బీజేపీ.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం.. ఏడాదిలోపు పదవీ కాలం ఉంటే.. ఉపఎన్నికలను ఈసీ నిర్వహించదు. జూన్ నాలుగో తేదీతో ఎంపీలు ప్రమాణస్వీకారం చేసి నాలుగేళ్లు పూర్తవుతాయి. ఐదో తేదీ రాజీనామా ఆమోదించినా… అప్పటికి.. ఏడాది పదవి కాలం ఉండదు కాబట్టి ఉపఎన్నికలు రావు. ఈ కారణంగా ఐదు లేదా ఆరో తేదీని.. ఎంపీల రాజీనామాల ఆమోదానికి ముహూర్తంగా పెట్టకున్నట్లు తెలుస్తోంది.