ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుకు చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాజకీయాల్లోకి రావాలని నవ నిర్మాణ దీక్ష వేదికగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యోగసంఘాల నేతగా అశోక్ బాబు.. విపరీతంగా శ్రమించారని.. చంద్రబాబు ప్రశంసించారు. అదే నిబద్దతో ప్రజాజీవితంలోకి అడుగు పెట్టాలని ఆహ్వానించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న అశోక్ బాబు మరో ఏడాదిలో ఉద్యోగవిరమణ చేస్తారు. చంద్రబాబు ఆహ్వానంపై … అశోక్ బాబు కూడా సానుకూలంగా స్పందించారు. ఉద్యోగసంఘాలతో చర్చించి.. నిర్ణయం తీసుకుంటానన్నారు.
అశోక్ బాబు కొద్ది రోజుల కిందట కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయవద్దని కొన్ని ఇతర ప్రజాసంఘాలతో కలసి బెంగళూరులో ప్రచారం చేయడం వివాదాస్పదమయింది. అక్కడ వైసీపీ నేతలుగా భావిస్తున్న వారు అడ్డుకున్నారు. ఇక్కడ బీజేపీ నేతలు.. అశోక్ బాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పుడే చాలా మంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రాపకం కోసం… రాజకీయ భవిష్యత్ కోసం… అశోక్ బాబు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. కానీ ఈ ఆరోపణలను అశోక్ బాబు అప్పటికప్పుడే ఖండించారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో అశోక్ బాబు కీలక పాత్ర పోషించారు. ఉద్యోగసంఘాలన్నినీ ఏకతాటిపైకి తీసుకు వచ్చి.. పోరాడారు. అయితే ఆయన మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో సామరస్యంగా ఉంటామని.. దానికే తనపై విమర్శలు చేయడం సమంజసం కాదని అశోక్ బాబు చెబుతూ ఉండేవారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగసంఘాల నేతలు రాజకీయాల్లోకి రావడం కొత్తేమ కాదు. తెలంగాణలో సకలజనుల సమ్మెను నిర్వహించిన ఉద్యోగసంఘాల నేతలు స్వామిగౌడ్ ఇప్పుడు మండలి చైర్మన్ గా ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రి పదవి కోసం పోరాడుతున్నారు. దేవీప్రసాద్ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. సమైక్య రాష్ట్రంలో ఏపీ ఎన్జవో అధ్యక్షుడిగా వ్యవహరించిన గోపాల్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ. ఏది ఏమైనా… చంద్రబాబు ఆహ్వానంతో ఆశోక్ బాబు రాజకీయ ప్రవేశం ఖరారైనట్లే చెప్పుకోవచ్చు. అది ప్రత్యక్ష ఎన్నికల ద్వారానా.. ఎమ్మెల్సీ లాంటి పదవులతో పరోక్ష ఎన్నికల ద్వారా అన్నది .. మరో ఏడాదిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.