ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి వెంట తొలిసారి ఆపరేషన్ గరుడ అనే మాట వినిపించింది. భారతీయ జనతాపార్టీ ..ఆంధ్రప్రదేశ్ పై మహాకుట్ర చేస్తోందని… చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. ఈ మేరకు నవనిర్మాణ దీక్షలో ప్రకటించారు. బీజేపీతో చేతులు కలిపి ఓ వైపు జగన్, మరో వైపు పవన్ … ఏపీలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ నేతలు రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారని.. అదే సమయంలో పవన్ కల్యాణ్ కళింగాంధ్ర పేరుతో అందర్నీ రెచ్చగొడుతున్నారని.. జగన్ ద్వారా .. మరింత అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు చెబుతున్నారు. రమణదీక్షితుల వివాదం ఈ కుట్రలో భాగమేనని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు.
ప్రత్యేకహోదా సాధన సమితి పేరుతో.. ఉద్యమం చేస్తున్న శివాజీ కొద్ద రోజుల క్రితం ఆపరేషన్ గరుడ అనే కుట్రను బీజేపీ అమలు చేస్తోందని ప్రకటించారు. మొదట్లో దీన్నెవరూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ రాజకీయ పరిణామాలన్నీ మెల్లగా.. శివాజీ చెప్పినట్లే జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్, జగన్ ఇద్దర్నీ కలిపి.. కుల కుంపట్ల రాజేసీ ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తారమని.. అంతిమంగా తెలుగుదేశం పార్టీని దెబ్బకొడతారని శివాజీ చెప్పారు. దీనికి తగ్గట్లుగానే శుక్రవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఒకరు ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటాయని…బెదిరించినట్లు పత్రికల్లో వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచినా తెలుగుదేశం పార్టీని మాత్రం అధికారంలోకి రానివ్వబోమని ఆయన కాస్త తీవ్ర స్వరంతోనే చెప్పారట. చంద్రబాబు శీర్షాసనం వేసినా… మళ్లీ ముఖ్యమంత్రి కాలేడన్నారు. అంతే కాదు.. 1984లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న సంక్షోభమే.. 2019లో చోటుచేసుకుంటుందని హెచ్చరింటారట. అనేక రాష్ట్రాల్లో అతి పెద్ద పార్టీలను సైతం కాదని.. బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఉండటంతో బీజేపీ ఆలోచనలు అలాగే ఉంటాయన్న అంచనాలు కూడా ఉన్నాయి.
చంద్రబాబు అలా గరుడ గురించి ప్రస్తావించగానే వెంటనే .. బీజేపీ కూడా రియాక్ట్ అయింది. ఒక సైడ్ యాక్టర్ చెప్పిన మాటలను పట్టుకుని… ఆపరేషన్ గరుడ అంటూ నీచరాజకీయాలకు దిగజారుతున్నారని ఎమ్మెల్సీ మాధవ్ వెంటనే స్పందించారు. కానీ ఏపీలో జరుగుతున్న పరిణామాలపై మాత్రం ఆయన స్పందించలేకపోయారు. కులాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు… ఏ ఆపరేషన్ లో భాగమో చెప్పలేకపోయారు. కానీ విభజన వల్ల ఏపీకి ప్రయోజనాలు చేకూరాయని మాత్రం వంచన చేసుకున్నారు. మొత్తానికి చంద్రబాబు కూడా ఆపరేషన్ గరుడను ప్రస్తావించడంతో ముందు ముందు మరింత హాట్ టాపిక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.