ఆర్.మార్తాండ శర్మ
చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. అనుభవం లేని నాయకులు వచ్చారు. మేము వేసిన రోడ్లపై నడుస్తున్నారు. మమ్మల్నే విమర్శిస్తున్నారు అంటూ. నవ్వాలో..ఏడవాలో అర్థం కావడం లేదు చంద్రబాబు మాటలు వింటుంటే. చంద్రబాబు సినిమాటోగ్రఫీ మంత్రి అయినపుడు ఆయన అనుభవం ఎంత? సరే ఆ సంగతి వదిలేద్దాం. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినపుడు ఆయన అనుభవం ఏమిటి? అప్పుడు ఆయన 9 నెలలు చైతన్య యాత్ర చేసినది ఏ రోడ్లపైన?
అప్పటి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వుంది. మా రోడ్లపై నడుస్తున్నారని ఆ పార్టీ నాయకులు అప్పట్లో ఎక్కడన్నా అన్నారా? అయినా చంద్రబాబుకు ఈ అనుభవం పిచ్చి ఏమిటో? 2014లో ఇదే మాట. అనుభవం..అనుభవం అంటూ.
ఇప్పుడు మళ్లీ అదే మాట… కానీ జనాలకు కూడా గత నాలుగేళ్లలో అనుభవం అయిపోయింది కదా? ఆ అనుభవం మాట వినేకదా? పవన్ కూడా మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఆయనకే అనుభవం అయి బాబుకు దూరం జరిగారు. ఇలా జనాలకు, పవన్ కు, భాజపాకు అందరకీ బాబుతో అనుభవం అయిపోయింది. అయినా ఇంకా బాబు అనుభవం..అనుభవం అంటూ పలవరిస్తున్నారు. ఆయనకు చెప్పడానికి మరేమీ మిగలలేదని అనుకోవాలా?