ఎనిమిది రాష్ట్రాల్లో రైతులు పోరుబాట పట్టారు. నిజానికి, తీవ్రమైన అంశం. ఎందుకంటే, ప్రధాన రాజకీయ పార్టీల అండ లేకుండా కొన్ని వేల మంది రైతులు రోడ్ల మీదికి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తుండటం మామూలు విషయం కాదు. వరుసగా 10 రోజులపాటు 8 రాష్ట్రాల రైతులు నిరసనలు తెలిపేందుకు సిద్ధమయ్యారు. రైతాంగం సమస్యల్ని తీర్చాలంటూ కూరగాయలు, పాలు వంటి ఉత్పత్తుల్ని మార్కెట్లకి తీసుకెళ్లకుండా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఢిల్లీ మార్కెట్లో కూరగాయల కొరత ఏర్పడింది, ఉన్నవాటి ధరలు భగ్గుమంటున్నాయి. ఇంతమంది రైతులు ఉద్యమిస్తుంటే, కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా అనిపించకపోవడం దారుణం. అంతేకాదు, అన్నదాతల ఆక్రందనపై కేంద్ర వ్యవసాయ మంత్రే దిగ్భ్రాంతి కరమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ మాట్లాడుతూ.. మీడియాను ఆకర్షించాలనే యావతోనే రైతులు నిరసనలు చేస్తున్నారన్నారు! దేశంలోని దాదాపు 14 కోట్ల రైతులుంటారనీ, ప్రతి రైతు సంఘంలోనూ దాదాపు 20 వేలమంది ఉంటారనీ, వీరంతా మీడియాలో ప్రచారం ఆశిస్తున్నారని ఎద్దేవా చేశారు. హర్యానా సీఎం మనోహర్ లాలా కట్టార్ కూడా ఇదే తరహాలో స్పందిస్తూ… రైతులు చేస్తున్న ఆందోళనలు అర్థం లేనివని కొట్టిపారేశారు. ఇలాంటి సమ్మెలు చేయడం వల్ల నష్టపోయేది రైతులు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇదొక పసలేని నిరసన అని ఆయన తీర్మానించేశారు.
2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేసేస్తా అని ప్రధాని నరేంద్ర మోడీ చాలా వేదికల మీద మాట్లాడుతూనే ఉంటారు. మరి, భాజపా సర్కారు రైతుల కోసం ఇంతవరకూ ఏం చేసిందనేది వారే చెప్పలేరు! ఇప్పుడు, ఎలాంటి రాజకీయ పార్టీల చొరవా ప్రోత్సాహం లేకుండా, స్వచ్ఛందంగా నిరసనలు తెలుపుతుంటే కేంద్రం ఎందుకు స్పందించడం లేదన్నది ప్రశ్న..? అది చాలదన్నట్టుగా, మీడియాలో ప్రచారం కోసమే రైతు నిరసనలు అని వ్యాఖ్యానించడం బాధ్యతా రాహిత్యం అవుతుంది. మీడియా ముందు షో చెయ్యాల్సిన అవసరం రైతులకు ఏముంటుంది..? ఎవరినో ఆకర్షించాలనే ప్రచార యావ రైతుకు ఎందుకు ఏముంది..? పండించిన పంటకు మద్దతు ధర దక్కడం లేదనీ, నీటి పారుదల కావాలనీ, రుణ లభ్యత పెరగాలి అంటూ రైతులు రోడ్ల మీదికి వస్తే… అదేదో పనికిమాలిన అంశంగా తీసి పారేస్తుంటే ఎలా..? నిజానికి, మనదేశంలో వ్యవసాయం అసంఘటిత రంగం. అలాంటి రంగం నుంచి ఇన్ని వేల మంది సంఘటితం అయ్యారంటే… ఇది చాలా పెద్ద సమస్య. దీని తీవ్రతను గుర్తించే మూడ్ లో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు లేకపోవచ్చు. కానీ, దీని ప్రభావాన్ని అనుభవించాల్సిన సమయం కచ్చితంగా ముందుందనే చెప్పాలి.