తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తెరాస ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. పేరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. గడచిన నాలుగేళ్లలో తెరాస చేసిన అభివృద్ధిని మరోసారి చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కేసీఆర్ చెప్పారు. అయితే, ఇదే రోజున ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతలు ఏం చేశారంటే… మీడియా ముందుకు వచ్చి కేసీఆర్ పై విమర్శలు చేశారు. సరిగ్గా ఇక్కడే.. కాంగ్రెస్ నేతలు ఒక ఎమోషనల్ పాయింట్ ను మిస్ చేసుకుంటున్నారు..!
కేసీఆర్ సర్కారు వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ, అబద్ధాలను ప్రచారం చేస్తుండటం చూసి తనకు బాధ కలిగిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో గడచిన నాలుగేళ్లలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనీ, కారణం కేసీఆర్ పాలనా వైఫ్యలమే అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వస్తుందని నమ్మిన గిరిజనులు, దళితులు, బీసీలు కేసీఆర్ వల్ల మోసపోయారన్నారు. వారిని అణచివేసే ప్రయత్నం జరిగిందన్నారు. మరో నేత నాగం జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రచారం చేసుకోవడమే తప్ప.. ఈ నాలుగేళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి అంటూ ఏదీ లేదని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులన్నీ అవినీతిమయమనీ, మిషన్ భగీరథ పేరుతో ప్రజాధనం లూఠీ చేస్తున్నారని ఆరోపించారు.
సో,.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినాన్ని కాంగ్రెస్ పార్టీ ఇలా జరుపుకుంది! రాష్ట్ర అవతరణ నాడు కూడా ప్రతీరోజూ మాదిరిగానే కేవలం విమర్శలూ ఆరోపణలకు మాత్రమే పరిమితమయ్యారు. ఈ క్రమంలో వారు చేస్తున్నదేంటంటే… తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ అంతా కేసీఆర్ ఖాతాలో తీసుకెళ్లి పడేస్తున్నారు. కేసీఆర్ క్రుషిని ఎవ్వరూ కాదనరుగానీ, ఇతర పార్టీలు కూడా తెలంగాణకు అనుకూలంగా పనిచేశాయి కదా. అయితే, ఇదేదో తెరాసకు సంబంధించిన పండుగ, లేదా ప్రభుత్వం నిర్వహించాల్సిన కార్యక్రమంగానే రాష్ట్ర అవతరణ దినాన్ని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు. అంతకుమించి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిజమైన రోజుగా, తీవ్ర భావోద్వేగాలను కలిగిన రోజుగా కాంగ్రెస్ చూడటం లేదు. ఆ ప్రాధాన్యతను గుర్తించడం లేదు. దీని వల్ల రాజకీయంగా చూసుకుంటే తెరాస గెయిన్ అవుతోందని చెప్పాలి.
కేసీఆర్ నాలుగేళ్ల పాలన వేరు, రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భం వేరు. ఈ రెండూ ఒకటిగానే కాంగ్రెస్ చూస్తోంది. విమర్శలూ ఆరోపణలకు వేరే రోజులున్నాయి. కానీ, ఇలాంటి రోజుల్లో రాజకీయాలకు కాసేపు పక్కనపెట్టి పోరాటాలు గుర్తు చేసుకుంటే బాగుంటుంది కదా! ఈ కోణాన్ని కాంగ్రెస్ పెద్దగా పట్టించుకోవడం లేనట్టుగానే ఉంది. నిజానికి, తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ అంశాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు అందివచ్చే సందర్భాలను కూడా టి. కాంగ్రెస్ నేతలు దుర్వినియోగం చేసుకుంటున్నారు.