ప్రతి శుక్రవారం ఏదొ ఒక బొమ్మ సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఆ మాటకు వస్తే ఒకటన్నమాటేమిటి? రెండు మూడు సినిమాలు కూడా వస్తుంటాయి. కొన్ని బొమ్మలు చూస్తే హమ్మ..అనిపిస్తుంది. మరి కొన్ని బొమ్మలు చూస్తే దిమ్మ దిరిగిపోతుంది. ఇంకొన్ని బొమ్మలు చూస్తే, ఇలా కాకుండా అలా చేసి వుంటే అని కూడా అనిపిస్తుంది. సాధారణంగా సమీక్షల్లో ఇలాంటివి అన్నీ ముచ్చటించుకోలేం. సమీక్షకు వున్న పరిథులు అలాంటివి. ఆ పరిథులు దాటి సినిమాను చూస్తే…అదే బొమ్మ బొరుసు.
చుట్టూ జనం..మధ్యలో మనం. నిజానికి సినిమా షూటింగ్ ఇలాగే వుంటుంది. చుట్టూ షూటింగ్ చూడ్డానికి వచ్చే జనం. యూనిట్ సభ్యులు. మధ్యలో నటించేవారు. మాంచి సందడిగా వుంటుంది. కానీ ఒకసారి సినిమా షూటింగ్ చూస్తే కొత్తగా వుంటుంది. మళ్లీ మళ్లీ చూస్తే పరమ బోరింగ్ గా వుంటుంది. ఎందుకంటే ఒకటే సీన్ ఒకటికి పది సార్లు టేక్ ల మీద టేక్ లు తీస్తుంటే, ముక్కల ముక్కలుగా సీన్లు తీస్తుంటే, చూసే వాళ్లకి మాత్రం కాస్త బోర్ గానే వుంటుంది. చుట్టూ జనం..మధ్యలో మనం అనే పాయింట్ చుట్టూ అల్లిన కథతో తయారైన నేలటికెట్ వ్యవహారం కూడా అచ్చంగా అలాంటిదే.
నేలటికెట్ కథను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఎప్పడో రాసుకున్నాడు. ఆ తరువాత సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో నేల నుంచి బాల్కనీకి వచ్చేసినా, ఈ నేలటికెట్ ను మాత్రం వదల్లేదు. అంటే అర్థం అయిపోతుంది. ఈ నేలటికెట్ ఏనాటిదో అని. ఈ నేల టికెట్ కాస్తా కళ్యాణ్ కృష్ణ జేబులో వుండి..వుండి..నలిగి..నలిగి..పరమ పాతదైపోయింది. ఇప్పుడు దాన్ని బయటకు తీసి, చెంబిస్త్రీ చేసి, కొత్తగా చూపించే ప్రయత్నం చేసాడు.
అంటే నేలటికెట్ సినిమా సమస్య కథ దగ్గరే మొదలయింది అన్నమాట. కథ ఎంత పాతది అంటే అనాధను చేరదీసి పెంచి పెద్దవాడిని చేసిన పెద్దాయిననే చంపేస్తే, మరో అనాధ పగతీర్చుకోవడం అన్నది లైను. ఇలాంటి లైన్లు సినిమా పుట్టిన తరువాత నుంచి సవాలక్ష మీద ఒకటో రెండో ఎక్కువే వచ్చాయి. ఆ సంగతి దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు తెలియంది కాదు. నిజానికి అలా తెలియడమే సమస్య అయింది. పాత లైనుకు కొత్త లైన్లు అనేకం కలిపి పాచీలు వేసి, ఓ కొత్త ముక్కల చొక్కా తయారుచేసాడు దర్శకుడు.
జగపతిబాబు ఇటీవల వేసిన అనేక విలన్ పాత్రలు రుబ్బేసి ఓ విలన్ ను తయారుచేసాడు. ఆ విలన్ వ్యవహారాల కోసం అనేకానేక సినిమాల నుంచి ‘ఫ్రీ మేక్’ పాయింట్లు తీసుకున్నాడు. ఇక అవి చాలక, ఓల్డేజ్ జనాల సమస్యల దగ్గర ప్రారంభించి, రాజకీయ నాయకుల పార్టీల మార్పిడి, కొనుగోళ్లు, కానిస్టేబుళ్ల నియామకాలు, వాటిలో లాలూచీ వ్యవహారాలు. ఇలా ఏవి కనిపిస్తే వాటిని జోడించుకుంటూ వెళ్లిపోయాడు దర్శకుడు.
ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, దర్శకుడు చాలా సినిమాలు చూసి, అందులో ఓ పాయింట్, ఇందులో ఓ ముక్క ఇలాంటివి అన్నీ బుర్రకు ఎక్కించుకుని, వాటన్నింటిని తన దగ్గరున్న ఏజ్ ఓల్డ్ ప్లాట్ లోకి ఇరికించే ప్రయత్నం చేస్తే, నేలటికెట్ సినిమా ఇలా తయారయింది అని అనిపిస్తుంది. సినిమా చూస్తుంటే ఈ విషయం క్లియర్ గా అర్థమైపోతూ వుంటుంది.
ఒంటి మీద టట్టూలు వేసుకున్నా దానికి కూడా ఓ అందం చందం వుండాలి. ఎవరెవరో ఏవేవో వేసుకున్నారని, అక్కడోటి ఇక్కడోకి తీసుకువచ్చి మన వంటి నిండా పొడిపించుకుంటే వళ్లంతా మసిపూసుకున్నట్లు వుంటుంది తప్ప, అందం చందం కనిపించదు.
అసలు సినిమా ఓ కొలిక్కి వచ్చేసింది అన్న తరువాత కూడా పోలీస్ కానిస్టేబుళ్ల ఎపిసోడ్ ఇరికించడం అన్నది దర్శకుడి స్టామినాను అనుమానించేలా చేస్తుంది. ఆ ఎపిసోడ్ లో అయితే అసలు లాజిక్ లు ఎక్కడా కనిపించవు. కానీ ఆ ఎపిసోడ్ ను బిల్డప్ చేయడం కోసం వేసుకున్న, రకరకాల బిట్ సీన్లు ఏవీ పండలేదు. ఎమోషన్ పంపాలి అంటే దానికి ఓ లైనూ లెంగ్తూ వుంటుంది. ఎంటర్ టైన్ మెంట్ అన్నది కీలకం. ఆపైన యాక్షన్. ఇవి చాలవని ఫ్యామిలీ సెంటిమెంట్లు, ఎమోషన్లు, ప్రజల కష్టాలు ఇలా కనిపించిన ప్రతీదీ, దొరికిన ప్రతీదీ కూరేస్తే ఎలా? నేలటికెట్ సమస్య అదే.
దర్శకుడికి సినిమా మేకింగ్ లో ఓ స్థిరమైన ఆలోచన వున్నట్లు ఎక్కడా కనిపించదు. అప్పటికప్పుడు ఏది తోస్తే అది సినిమాలోకి లాగేసినట్లు కనిపిస్తుంది.
సినిమా క్లయిమాక్స్ ఇలా వుంటుంది అని దర్శకుడు ముందే అనుకున్నపుడు, ఎత్తుగడ దగ్గర నుంచి దానిని దృష్టిలో పెట్టుకుని వెళ్లాలి. సినిమా ఆరంభం నుంచి అక్కడక్కడ డైలాగ్ రూపంలోనో, సీన్ రూపంలోనో హింట్ ఇవ్వాలి. ఇవేమీ చేయకుండా అటు పరమ దుష్టత్వం చూపించి, ఇటు కసి, కోపం చూపించి, చివర్న మళ్లీ ఇలా క్లయిమాక్స్ ఇస్తే, నవ్వులాటగా వుంటుంది.
కొన్ని సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ వుంటాయి. కొన్ని సినిమాలు స్క్రిప్ట్ ఫెయిల్యూర్ లు వుంటాయి. మరి కొన్ని సినిమాలు కాస్టింగ్ ఫెయిల్యూర్లు వుంటాయి. నేల టికెట్ మాత్రం పక్కాగా దర్శకుడి ఫెయిల్యూర్. ఎందుకంటే కాస్టింగ్ ఓకె. లైన్ ఫరవాలేదు. నిర్మాత కూడా బాగానే ఖర్చు పెట్టారు. కానీ సరిపోనిదల్లా దర్శకుడి స్టామినా. ఇటు రచయితగా, అటు దర్శకుడిగా కూడా.
ఆర్. మార్తాండ శర్మ