గౌతి హరినాథ్… తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులకు ఈ పేరు సుపరిచితమే. టాప్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, హీరో కమ్ విలన్ జగపతిబాబులకు ఆయన మేనేజర్. ఈ ముగ్గురికి మాత్రమే కాదు… గతంలో ప్రియమణి, ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్, హెబ్బా పటేల్, షాలినీ పాండే తదితరులకు ఆయన మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడీ హరినాథ్ రాజకీయంగానూ అడుగులు వేస్తున్నారు. తాజాగా ఈయనకు బీజేపీలో ఓ పదవి దక్కింది. ‘తెలంగాణ బీజేపీ సినిమా సెల్ స్టేట్ కన్వీనర్’గా హరినాథ్ నియమితులయ్యారు. సినిమా హీరోలు, హీరోయిన్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. వాళ్ళకు చెప్పుకోదగ్గ పదవులు లభించడమూ కొత్తేమీ కాదు. కానీ, ప్రముఖ హీరో హీరోయిన్లకు మేనేజర్‌గా పని చేస్తున్న వ్యక్తికి పదవి దక్కడం బహుశా ఇదే తొలిసారి అనుకుంట. వచ్చే ఎన్నికల్లో సినిమా గ్లామర్ మీద బీజేపీ దృష్టి పెడుతుందా? తమ పార్టీ తరపున హీరోయిన్ల చేత ప్రచారం చేయిస్తుందా? కాలమే సమాధానం చెబుతుంది.