తెలుపునకు వ్యతిరేకం ఏది అంటే.. స్కూళ్లలో కూడా నలుపే అని చెబుతున్నారు. కానీ తెలుపు, నలుగు స్వభావరీత్యా రంగులే కానీ.. వాటికి వాటికి వ్యతిరేకం ఏముంటుంది. ఎరుపు, పసుపు ఇవన్నీ ఏ తరహావి…? ఈ విషయం ఎవరూ ఆలోచించరు. కానీ ప్రజల మనసుల్లో అలా ముద్ర వేసేశారు అంతే. ఈ అజ్ఞానాన్ని … చదువుకున్న వారితో సహా అందరికీ పంచేందుకు మీడియా తన వంతు కృషి చేస్తోంది. ఆడవాళ్లకు బద్ద శతృవులు మగవాళ్లే అని నిరూపించేందుకు.. కొత్త కొత్త దారులు వెదుక్కుంటోంది. స్త్రీవాదం అంటే.. పురుషుల్ని ద్వేషించడం అనే కొత్త కాన్సెప్ట్‌ను .. ఊరూపేరూ తెలియని ప్రముఖులతో చెప్పించి.. మ్యాన్ వర్సెస్ ఉమన్ అన్న వాతావరణం తెచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు.
కొన్నాళ్ల క్రితం.. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి.. ఆడవాళ్ల చేతిలో అన్యాయాలకు గురువుతున్న మగవారిపై సానుభూతి వ్యక్తం చేశారు. వారికి కూడా ఓ పురుష కమిషన్ పెట్టాలేమో అన్నంతగా ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ లో స్వాతి దగ్గర్నుంచి శ్రీకాకుళం జిల్లాలో భర్తలను హత్య చేసిన , హత్య చేయడానికి ప్రయత్నించి సరస్వతి, నీలిమ అనే యువతలు వరకు అనేక ఘటనలు వెలుగు చూశాయి. ఎప్పుడూ మహిళలపై జరుగుతున్న దాడులపై స్పందించే నన్నపనేని రాజకుమారి.. మహిళలే ఇలా చేయడంతో కాస్త ఆవేదన చెందారు. దానికి కారణాలేమిటన్నదానిపై విశ్లేషిస్తూ టీవీ సీరియళ్లను నిందించారు. పనిలో పనిగా మగవారిపై సానుభూతి చూపించారు. ఇదే తప్పయిపోయింది.. మహిళా సంఘాల పేరుతో కొంత మంది రంగంలోకి దిగిపోయారు. అసలు మహిళా కమిషన్ చైర్పర్సన్ అయి ఉండి.. పురుషులకు అనుకూలంగా ఎలా వ్యాఖ్యలు చేస్తారనేది.. ఆ మహిళా సంఘాల ప్రశ్న.
ఏం.. మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినంత మాత్రాన .. తప్పు చేసినా… హత్యలు చేసినా… మహిళలను సమర్థించాల్సిందేనా..? అంటే..అవుననే అంటున్నారు ఈ మహిళా సంఘాల నేతలు. ఏం చేసినా మహిళ అంటే అండగా ఉండాల్సిందేనని వీరి వాదన. అంతే కాదు..మగవాళ్లను ద్వేషించాల్సిందేనని.. కారణాలు అవసరం లేదని కూడా వీరు లాఘవంగా వాదించేయగలరు. అందుకే.. పురుషులపై సానుభూతి చూపిన… నన్నపనేని రాజకుమారి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ… టీవీలకు ఎక్కేశారు. అంటే వీరి ఉద్దేశంలో… మహిళకు వ్యతిరేక పదార్థం పురుషుడు… అంతే..! మరి ఇంత కాలం .. మహిళకు మహిళే శతృవు అని చెప్పుకుంటూ వస్తున్నారు.. మరి దాన్నేం చేస్తారో.. ఈ మహిళా సంఘాల నేతలు..!