కర్ణాటకలో ముఖ్యమంత్రిగా కుమారస్వామి, ఉపముఖ్యమంత్రిగా పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేసిన పది రోజుల తర్వాత కానీ.. కాంగ్రెస్, జేడీఎస్‌లు ఎవరెవరు ఏ ఏ శాఖలు తీసుకోవాలన్నదానిపై స్పష్టతకు రాలేకపోయారు. సంఖ్యా బలాన్ని బట్టి కాంగ్రెస్‌కు ఇరవై రెండు, జేడీఎస్‌కు పన్నెండు పదవులు తీసుకోవాలని ముందస్తుగా లెక్క తేల్చుకున్నా.. శాఖల వద్ద మాత్రం పీట ముడి పడిపోయింది. ఈ విషయంలోనూ.. కాంగ్రెస్‌నే రాజీ పడి.. ఆర్థిక శాఖ వంటి కీలక శాఖల్ని వదిలేసుకుంది. దానికి ప్రతిగా.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ కలసి పోటీ చేస్తామన్న ప్రకటనను మాత్రం జేడీఎస్ ఇచ్చింది. అక్కడితో రెండు పార్టీల మధ్య పంచాయతీ ముగిసింది. కానీ రెండు పార్టీల్లో అంతర్గగత పంచాయతీ మాత్రం ప్రారంభమయింది.
ఆరో తేదీన మంత్రుల ప్రమాణస్వీకారం కోసం ముహుర్తం నిర్ణయించుకున్నారు. గవర్నర్ వజూభాయ్ వాలా ఢిల్లీ పర్యటనకు వెళ్తూండటంతో.. ఐదారు రోజుల గ్యాప్ వచ్చింది. వెంటనే ప్రమాణస్వీకారం పెట్టేసి ఉంటే.. ఈ రెండు పార్టీలకు.. పెద్ద తలనొప్పి ఉండేది కాదు… ఎందుకంటే.. ఎవరెవరికి మంత్రి పదవులు అనేదానిపై వారిప్పటికే ఓ అవగాహనకు వచ్చి ఉండేవారు. కానీ ఐదు రోజుల గ్యాప్ ఉండేసరికి… ఎమ్మెల్యేలంతా… తమ పార్టీ హైకమాండ్‌పై ఒత్తిడి ప్రారంభించారు. రాజకీయాల్లో పండిపోయిన వారు కావడంతో… తమ ఒత్తిడిని మంత్రి పదవి పొందేదాకా తీసుకెళ్లేందుకు … అలగడం దగ్గర్నుంచి.. పార్టీ జంపింగ్ వార్తలు పుట్టించడం వరకూ చాలా చేస్తున్నారు.
ఈ విషయంలో జేడీఎస్ కన్నా.. కాంగ్రెస్ నేతలు మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ మార్క్ రాజకీయాలను ఒంట బట్టించుకున్న వారు కావడంతో.. కొత్త కొత్త పుకార్లను పుట్టిస్తున్నారు. మంత్రి పదవి రాకపోతే.. ఎమ్మెల్యే బీజేపీకి వెళ్లిపోతారట.. అని అనుచరులతోనే ప్రచారం చేయించేస్తున్నారు. ఇలాంటి ప్రచారాల వల్ల ఇప్పటికి… ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారని అక్కడి మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇవన్నీ మంత్రి పదవుల కోసం వేస్తున్న ఎరలే అని అని మీడియాకు కూడా తెలుసు. అందుకే లైటర్‌వీన్‌లోనే పబ్లిసిటీ చేస్తోంది. కానీ ఇప్పటికీ.. అధికారికంగా ఎవరెవరు మంత్రులు, ఆ మంత్రుల్లో ఎవరెవరికి ఏ శాఖలు ఇస్తారన్నదానిపై అధికారిక ప్రకటన లేదు. అందుకే ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఇరు పార్టీల్లోనూ ఈ కుస్తీ ఆరో తేదీ వరకు ఉంటుంది. ఆ తర్వాత కూడా.. ప్రాధాన్య శాఖలు ఇవ్వలేదనే అసంతృప్తి … పదవులు పొందిన వారిలో కూడా ప్రారంభమవుతుంది. ఇదో జీడిపాకం..అసంతృప్తి రాజకీయ సీరియల్. దీనికి ఐదేళ్ల వరకూ అంతం ఉండదు. అదే సంకీర్ణ ప్రభుత్వ ప్రథమ లక్షణం.