దేశవ్యాప్తంగా జరిగిన నాలుగు లోక్‌సభ, పదకొండు శాసససభ ఉపఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ప్రతిపక్షాలు నేతలు.. బీజేపీని ఓడించేస్తామని గాల్లో తేలుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని… తమ ప్రభుత్వం వస్తుందని కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారతాయని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. కానీ బీజేపీని ఓడించడం అంత సులువు కాదు. ఎందుకంటే.. మన దేశంలో ఓటింగ్‌కు, సీట్లకు అసలు సంబంధం లేదు.
ఓటింగ్ తక్కువొచ్చినా బీజేపీకి సీట్లు..!
గత ఎన్నికల్లో బీజేపీ 31 శాతం ఓట్లతో 282 సీట్లను తెచ్చుకుని అధికారం సాధించింది. అంటే బీజేపీకి, మోదీకి 69 శాతం మంది వ్యతిరేకంగా ఓట్లేసినా.. బీజేపీకి మెజార్టీ వచ్చింది. గత అనుభవాలు చూస్తే రాజీవ్ గాంధీకి 39 శాతం ఓటింగ్ వచ్చినా ఓడిపోయారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇందిరాగాంధీకి 34 శాతం ఓట్లు వచ్చినా ఓడిపోయారు. కానీ ఇప్పుడు 31 శాతం వచ్చినా విజయం సాధించారు. దీనికి కారణం ఏమిటంటే.. ప్రతిపక్షాలు ఎక్కువగా పోటీ చేసి ఓట్లు చీల్చడం. కానీ విపక్షాలు అన్నీ కలసిపోయామన్న ధీమాలో ఉన్నాయి. కానీ బీజేపీ గెలవడానికి విపక్షాల ఓట్లు చీల్చడం ఒక్కటే కాదు. బీజేపీ సమీప ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌పై 12 శాతం అధికంగా ఓట్లను సాధించింది. బీజేపీ అధికారంలోకి రావడానికి ఇదీ కూడా ఓ కారణం.
కాంగ్రెస్ బలపడితేనే బీజేపీ ఓటమి..!
అంటే అర్థం.. ఏమిటంటే.. కాంగ్రెస్ పునరుజ్జీవం కాకుండా… బీజేపీని ఓడించడం సాధ్యం కాదు. కర్ణాటకలో కాంగ్రెస్‌కి ఓట్లు పెరిగాయి కానీ.. సీట్లు పెరగలేదు. ఉపఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే… బీజేపీ ఓడిపోయిన మాట నిజం కానీ.. కాంగ్రెస్ పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. కాంగ్రెస్ మెరుగుపడుతోందా లేదా అన్నది మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ ఎన్నికలతో తేలనుంది. ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే.. ఆ పార్టీ పునరుజ్జీవం పొందుతున్నట్లే. కాబట్టి… బీజేపీ ఓడిపోతుంది కాబట్టి.. అధికారం వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటే. కాంగ్రెస్ పుంజుకుంటేనే… బీజేపీని అధికారానికి దూరం చేయగలరు.
బీజేపీ ఓట్ల శాతం తగ్గడం లేదు..!
అదే సమయంలో బీజేపీ ఓటింగ్‌ను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. బీజేపీ ఓటింగ్‌ను కైరానా ఉపఎన్నికల్లో పరిశీలిస్తే.. నాలుగు పార్టీలు కలిసి.. ఆర్ఎల్డీ అభ్యర్థిని నిలబెట్టారు కాబట్టి అక్కడ గెలిచారు. అక్కడ బీజేపీకి 2014లో యాభై శాతానికిపైగా ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు ఉపఎన్నికల్లో 46శాతం ఓట్లు వచ్చాయి. అంటే బీజేపీకి తగ్గిన ఓటింగ్ చాలా స్వల్పమే. అంటే.. నాలుగు పార్టీల్లో ఏ ఒక్కటి హ్యాండిచ్చినా.. ఓట్లు బదిలీ కాకపోయినా.. బీజేపీ గెలిచి ఉండేది. అంటే.. బీజేపీ ఓడిపోయింది కానీ.. పతనం కాదు. అందుకే ఈ ప్రతిపక్షాలు ఈ విజయాలను.. అంతిమంగా తీసుకుంటే ఇబ్బందులే. ఉపఎన్నికల్లో బీజేపీ వరుసగా ఓడిపోతూ వస్తోంది. కానీ.. ఓటింగ్ శాతం అంత దారుణంగా పడిపోవడం లేదు. ఓటింగ్ పడిపోకుండా.. బీజేపీని ఓడించడం అసాధ్యం. ప్రస్తుతం రాజకీయాల్లో.. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు పూర్తి స్థాయిలో విశ్వాసం పొందలేకపోతోంది. ప్రాంతీయ పార్టీల పరిస్థితి కూడా అదే.
శరవేగంగా ఆర్ఎస్ఎస్ విస్తరణ..!
బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఇదే. బీజేపీకి ఉండే రెండో అడ్వాంటేజ్ ఆర్ఎస్ఎస్ విస్తరణ. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలుస్తోందంటే.. దశాబ్దాల ఆర్ఎస్ఎస్ కృషి ఉంది. కర్ణాటకలో బీజేపీకి ఎక్కువ సీట్లు రావడానికి ఆర్ఎస్ఎస్నే కారణం. ఈ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. దాదాపు 80లక్షల మంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖల్లో సభ్యులుగా ఉన్నారు. మూడోది.. దేశంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక.. కమ్యూనల్ గొడవలు ఇరవై ఎనిమిది శాతం పెరిగాయి. ఈ గొడవలు పెరగడం.. బీజేపీకి లాభం కలుగుతుంది. హిందూత్వ ఓట్లను ఏకం చేయడానికి బీజేపీ వీటిని ఉపయోగించుకుంటోంది.
పోటీ మతతత్వ రాజకీయాలు పరిష్కారం కాదు..!
దీనికి కౌంటర్‌గా సెక్యూలర్ ఓట్లను పొలరైజ్ చేయాలి. అలా కాకుండా.. కౌంటర్ గా తాము కూడా.. మతతత్వ రాజకీయాలు చేస్తే… లాభం ఉండదు. కైరానాలో అదే చేశారు. ముస్లిం అభ్యర్థి ముస్లిం ప్రాంతాల్లో, ఆర్ఎల్డీ జాట్ ఓటర్లన్న ప్రాంతాల్లో మాత్రమే ప్రచారం చేసి విజయం సాధించారు. ఈ వ్యూహం దీర్ఘ కాలంలో బీజేపీని ఓడించడానికి పనికి రాదు.
ప్రత్యామ్నాయ విధానాలు ఉండాలి..!
రైతుల సమస్యలు, నిరుద్యోగం లాంటి మౌలిక సమస్యలను మోదీ నిర్లక్ష్యం చేస్తున్నారు. మౌలిక సమస్యలు బీజేపీని దెబ్బతీస్తున్నాయి. వీటిని పరిష్కరించే విషయంలో బీజేపీ నిర్లక్ష్యంగా ఉంటోంది. అయితే కాంగ్రెస్ కానీ.. ఇతర ప్రాంతీయ పార్టీలు కానీ.. ఈ మౌలిక సమస్యలను.. పరిష్కరిస్తామని ఎక్కడా చెప్పడం లేదు. అందుకే ప్రత్యామ్నాయ పాలసీలు లేకుండా.. బీజేపీని ఓడిస్తామనుకోవడం కూడా భ్రమే.