జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చాలా దూకుడుగా.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. నిన్నామొన్నటి దాకా… చంద్రబాబు అనుభవం అంటే తనకెంతో ఇష్టం అన్న అయన ఇప్పుడు… ఆయన అనుభవం స్థానంలో అవినీతిని మాత్రమే చూస్తున్నారు. ఎక్కడైనా ఇసుక లారీ ఎదురైనా… మరెక్కడైనా స్టోన్ క్రషర్ కనిపించినా… అందులో పవన్ కల్యాణ్.. అంతులేని అవినీతిని చూస్తున్నారు. దాదాపుగా ప్రతీ చోటా.. ప్రతీ రోజూ… ప్రభుత్వంపై, చంద్రబాబుపై అవినీతి ఆరోపణలకు పెద్దపీట వేస్తున్నారు. పవన్‌లో ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పు ఏపీ రాజకీయాలను పరిశీలిస్తున్న వారికి ఆశ్చర్యం వేస్తోంది. కానీ.. అధికార పార్టీని వ్యతిరేకిస్తేనే భవిష్యత్ ఉంటుందన్న ఉద్దేశంతోనే పవన్ కల్యాణ్ అలా దూకుడుగా వెళ్తున్నారని వారు ఇప్పటి వరకూ విశ్లేషిస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ ఆరోపణల వెనుక చాలా దూరపు ఆలోచన ఉందని.. కొంత మంది విశ్లేషిస్తున్నారు.
జనసేన అధినేత ముఖ్యమంత్రి కలల్లో ఉన్నారు. తనకు సీఎం పదవి చేపట్టే అర్హత లేదని.. నిన్నామొన్నటి వరకూ చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఆలోచనల్లో మార్పు తెచ్చుకున్నారు. టీడీపీపై తన స్ట్రాటజీని ఎప్పుడు మార్చుకున్నారో.. ముఖ్యమంత్రి పదవిపై తన ఆలోచనలను అప్పుడే మార్చుకున్నారు. దీని వెనుక వ్యూహకర్తలో.. మరొకరో ఇచ్చిన బలమైన సూచలున్నాయని ప్రచారం జరుగుతోంది. కర్ణాటక పరిణామాల ముందు నుంచీ బీజేపీ నేతలు తనతో టచ్‌లో ఉన్నారని.. కర్ణాటకలో 70, 80 సీట్లు వచ్చినా బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పవన్ కల్యాణ్ శ్రీకాకుళంలో చెప్పుకొచ్చారు. బహుశా పవన్ కల్యాణ్‌కు కూడా.. వచ్చే ఎన్నికల తర్వతా ఎవరు గెలిచినా ముఖ్యమంత్రి పదవి వస్తుందని..చెప్పినట్లున్నారని కొంత మందికి ఉన్న సందేహం.
అయితే ఈ పరిస్థితి రావాలంటే.. కచ్చితంగా జగన్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు. అదే జరిగితే.. పవన్ కల్యాణ్‌పై తీవ్రమైన విమర్శలు వస్తాయి. తీవ్రంగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపించిన వ్యక్తితోనే.. ఎలా పొత్తుపెట్టుకున్నారని ప్రతి ఒక్క గళం ప్రశ్నిస్తోంది. అందుకే వ్యూహాత్మకంగా… చంద్రబాబు ఏమైనా శుద్ధపూసా..? అని ఎదురు దాడి చేయడానికి పవన్ కల్యాణ్..టీడీపీపై ఇప్పుడు అవినీతి ఆరోపణల స్టాండ్ తీసుకున్నారన్న విశ్లేషణలు ఇప్పుడు బలంగానే వినిపిస్తున్నాయి. చంద్రబాబు – జగన్ దొందూ..దొందే అన్నట్లుగా వాతావరణాన్ని ఇప్పటి నుంచే మార్చుకుంటే.. ఎన్నికల ముందు జరగబోయే రాజకీయ పరిణామాలను తాను జస్టిఫై చేసుకోవచ్చని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం భారతీయ జనతాపార్టీ వ్యూహం… ఆ పార్టీ గెలవడం కాదు. కనీసం డిపాజిట్లు తెచ్చుకోవడం కూడా కాదు. తెలుగుదేశం పార్టీని ఓడించడం. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కాకుండా చేయడం. ఇదే విషయాన్ని ఓ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వెల్లడించారని.. పత్రికలు వెల్లడించాయి. రాబోయే రోజుల్లో కొత్త కొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లు ఆయన చెప్పారు. కొత్త వ్యక్తులతో పార్టీలు పెట్టించడం, ఆ పార్టీలను కలసికట్టుగా పోటీ చేయించడం ఇందులో భాగం. ఈ వ్యూహంలో భాగంగానే.. జగన్, పవన్ కలిసేందుకు… మార్గం సుగమం చేసుకుంటున్నారన్నప్రచారం ఉంది. చంద్రబాబుపై అవినీతి ముద్ర వేస్తే..దాన్ని చూపి.. జగన్‌తో కలవొచ్చన్న పవన్ వ్యూహంతోనే… ఇప్పుడు ఆరోపణల పరంపర సాగుతోందన్న చర్చ.. ఇప్పుడు ప్రారంభమైంది. చంద్రబాబునే టార్గెట్ చేస్తున్న పవన్.. తన ప్రసంగాల్లో జగన్‌ను ఏమీ విమర్శించకపోతూండటం.. దీనికి బలం చేకూరుస్తోంది…
—సుభాష్